Cruise Ship: ఏపీలోని విశాఖపట్నం రేవు నుంచి సేవలందించే ప్రయాణికుల ఓడ ప్రస్తుతం ఒక్కటే ఉంది. అది కూడా అండమాన్ నికోబార్ దీవులకి నెలలో రెండుసార్లు మాత్రమే వెళ్లొస్తూ ఉంటుంది. ఈ ఓడలో వసతులకేమీ తక్కువుండదుకానీ... పర్యటకం నిమిత్తం విశాఖ నుంచి అండమాన్‌కి వెళ్లాలనుకునేవాళ్లు ఇందులో ఎక్కువగా వెళ్లరు. అలా కాకుండా పర్యటకులూ మెచ్చేలా విశాఖపట్నం నుంచి వివిధ తీరాలకి ఓ విలాసాల ఓడని నిర్వహించాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది.
ఆ చిరకాల కోరికని తీరుస్తామంటూ ముందుకొచ్చింది ‘కార్డేలియా క్రూయిజ్’ సంస్థ. వచ్చే బుధవారం నుంచి విశాఖ-పుదుచ్చేరి-చెన్నై-విశాఖ మార్గంలో తొలి సముద్రయానానికి శ్రీకారం చుట్టబోతోంది. మూడురాత్రులూ నాలుగు పగళ్లుగా సాగే పర్యాటక ప్యాకేజీ ఇది. దీనికి సంబంధించిన టికెట్లు ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడై పోయాయి. రైలైనా బస్సైనా మామూలుగా విశాఖ నుంచి పుదుచ్చేరికి వెళ్లాలంటే 15 గంటలు పడుతుంది. అదే ఈ ఓడ అయితే 36 గంటల సమయం తీసుకుంటుంది. అక్కడి నుంచి చెన్నై వెళ్లి మళ్లీ విశాఖకి రావడానికి మరో రెండురోజులు పడుతుంది. ఇంత ఆలస్యంగా ప్రయాణించినా సరే... పర్యటకులు ఈ ఓడలో ప్రయాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారంటే అందుకు చాలా కారణాలే ఉన్నాయి.
సాగరంలో ఓ స్టార్‌హోటల్:మన భారత సముద్రజలాల్లో తిరుగుతున్న అతిపెద్ద ప్రయాణికుల నౌకల్లో ఈ ‘కార్డేలియా క్రూయిజ్-ఎమ్వీ ఎంప్రెస్’ నౌక ఒకటి. ఇందులో ఒక్కసారే 1,500 మంది దాకా ప్రయాణించవచ్చు. ఓడలో మొత్తం 11 అంతస్తులుంటాయి. ఇంజిన్‌కీ, సరకులకీ కిందున్న రెండు అంతస్తులు పోగా... మూడో అంతస్తు నుంచి ప్రయాణికులు బసచేసే గదులు మొదలవుతాయి. అక్కడి నుంచి పదో అంతస్తుదాకా లిఫ్ట్‌లో వెళ్లొచ్చు.