ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై వరుణుడు ప్రకోపాన్ని చూపాడు. చాలా ప్రాంతాల్లో పంటపొలాల్లో వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. నవీపేట, బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాల్లో పంటలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ , బాన్సువాడ మండలాల్లో చెరువులు, వాగులు నిండి అలుగు పోస్తున్నాయి. వర్షపు నీరు చేరి పంటపొలాల్లోకి వరద నీరు చేరింది. సిరికొండ మండలం న్యావనంది శివారులో పంట పొలాల నుంచి పితురు వాగు ప్రవహించింది. నందిపేట మండలం వెల్మల్-నందిపేట మీదుగా జోర్పూర్ మధ్యలో జోర్పూర్ వాగు ఉధృతికి పంటలు నీట మునిగాయి. వెల్మల్ శివారులో వేయి ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నవీపేట మండలం అల్జాపూర్ లో పంటలు నీట మునిగాయి. ఆర్మూర్ మండలం దేగాంలో పంటలు నీట మునిగాయి. చందూర్ మండలం కేంద్రంలో పంటలు నీట మునిగాయి. బీర్కూర్ శివారులో పంట పొలాల నుంచి వరద నీరు ప్రవహించి పంటలు నీట మునిగి చెరువులను తలపించాయి.
తాడు సాయంతో పొలాలకు..
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ముక్కిడిగుండం, నార్లాపూర్ గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముక్కిడిగుండం ఉడుముల వాగు, నార్లాపూర్ పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముక్కిడిగుండం గ్రామానికి చుట్టూ వాగులు ఉండడంతో ప్రజలు ఎటు పోలేని పరిస్థి ఏర్పడింది. రైతులు పొలాలకు వెళ్లాలన్నా... తాడు సాయంతో భయం భయంగా దాటాల్సి వస్తోంది.
పత్తి పంటకు తీవ్ర నష్టం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్థంభించింది. భారీ వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో పెరుగుదల దశలో ఉన్న పత్తి పంట నీట మునిగిపోయింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని, కన్నెపల్లి, నెన్నెల, వేమనపల్లి, బెల్లంపల్లి, తాండూరు మండలాల్లో పత్తి పంట మునిగింది. కన్నెపల్లి మండలంలో నల్లవాగు, భీమిని మండలంలోని ఎర్రవాగు ఉప్పొంగడంతో చిన్న తిమ్మాపూర్, పెద్దతిమ్మాపూర్ గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ రెండు వాగుల ప్రవాహంతో పత్తి పంట నీటమునిగిపోయింది. రెవెన్యూ, పోలీసు అధికారులు మండలాల్లో పరిస్థితిని సమీక్షించారు.