Crop Loan Limit in Telangana : వానాకాలం(ఖరీఫ్) పంటల సాగుకు బ్యాంకులివ్వాల్సిన రుణాలను అరకొరగా పెంచారు. పంట సాగు చేయడానికి రైతు పెడుతున్న పెట్టుబడి ఖర్చుకు, బ్యాంకులిచ్చే రుణానికి పొంతన లేకుండా ‘రుణ పరిమితి’(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)ను రాష్ట్ర బ్యాంకర్ల సాంకేతిక కమిటీ ఖరారు చేసింది. సాగు ఖర్చులకు అనుగుణంగా గతేడాది కన్నా ఈ ఏడాది పంటరుణాన్ని కొన్ని పంటలకే పరిమితంగా పెంచి, మరికొన్నింటికి ఒక్క రూపాయీ పెంచకుండా వదిలేయడం గమనార్హం. రోజురోజుకు పంట సాగు ఖర్చులు పెరిగి రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుండగా వారికి మరింత ఎక్కువగా రుణాలిచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకులు పెద్దగా పట్టించుకోలేదు.
Annual Crop Loan in Telangana : రాష్ట్రంలో కూరగాయల కొరత తీవ్రంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున రోజూ దిగుమతి అవుతుండగా రైతులు సాగుచేసే కూరగాయ పంటలకిచ్చే రుణాలను ఏమీ పెంచలేదు. బత్తాయి, మామిడి, అరటి, సపోటా, పుచ్చ, తర్బూజ, సీతాఫలం తదితర పంటలకు ఇచ్చే రుణాల్లోనూ మార్పు చేయలేదు. వరికి బదులు ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయం వచ్చే, సాగునీటి వినియోగం తక్కువగా ఉండే జొన్న వంటి ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వం చెబుతుంటే రుణ పరిమితి ఖరారులో అందుకు విరుద్ధంగా కమిటీ నిర్ణయించడం గమనార్హం.
Scale Of Finance for crops : రాష్ట్ర బ్యాంకర్ల సాంకేతిక కమిటీకి ఛైర్మన్‌గా రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఉన్నారు. బ్యాంకులు అన్ని రంగాలకు ఇచ్చే మొత్తం రుణాల్లో వ్యవసాయరంగానికి దక్కుతున్న వాటా చాలా తక్కువగా ఉందని, దాన్ని పెంచాలని ఇటీవల ఆయన సూచించారు. అయినా బ్యాంకులు పెద్దగా పట్టించుకున్నట్లు లేదని రుణపరిమితి లెక్కలు వివరిస్తున్నాయి.
విత్తన పత్తి, విత్తన వరి పంటలకు ఒక్క రూపాయి రుణం పెంచలేదు.