ఖరీఫ్ వచ్చిందంటే.. ఏ ఖర్చులెంత పెరుగుతాయోననే దిగులే అన్నదాతలను వెంటాడుతోంది. సగటున మూడేళ్లలో 25%పైనే సాగు వ్యయం పెరిగింది. మద్దతు ధరలు మాత్రం 13.50%లోపే పెరిగాయి. వరి సాగుకు ఎకరాకు రూ.30వేలు అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే భారీ వర్షాలు, వరదలతో ఒక్కోసారి గింజ కూడా చేతికందడం లేదు. పసుపు, మిరప తదితర పంటలకు ఎకరాకు రూ.1.90 లక్షల వరకు వెచ్చిస్తారు. వీటి సగటు దిగుబడి 20 క్వింటాళ్లు.
క్వింటాలుకు రూ.8వేల లెక్కన చూస్తే మొత్తంగా వచ్చేది రూ.1.60 లక్షలే. ధర బాగా పెరిగి రూ.10వేలపైన లభిస్తేనే రైతు ఒడ్డున పడతారు. వరసగా పది రోజులు వానలు కురిసినా పసుపు కుళ్లుతుంది. మిరపకాయలు రాలిపోతాయి. పంట తాలుగా మారుతుంది. అన్నీ తట్టుకొని పంట తీసినా ధరలు దైవాధీనమే. వేరుసెనగ విత్తనానికే ఎకరాకు రూ.12వేలకుపైగా వెచ్చించాలి. పురుగు మందుల పిచికారికి గతంలో రూ.2వేలు ఖర్చయితే.. ఇప్పుడు రూ.5వేలు అవుతున్నాయి. కలుపుతీత, దాని నివారణ మందుల ఖర్చులూ పెరిగాయి. పంట అమ్మకం సమయానికి క్వింటా రూ.4వేలు కూడా పలకడం లేదు.
- ఎకరా పత్తికి రూ.28వేల పెట్టుబడి పెడితే సగటున 4నుంచి 6క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అంటే ఆదాయం రూ.24వేలలోపు మాత్రమే. గతేడాది తెగుళ్లు, వర్షాలతో ఎకరాకు 2క్వింటాళ్లు కూడా దక్కలేదు.
- కంది, మినుము, పెసర, సెనగ తదితర పంటలు వేయాలన్నా.. ఎకరా కౌలు రూ.8వేల నుంచి రూ.12వేల మధ్య ఉంది. పెట్టుబడి రూ.15వేలకుపైనే అవుతుంది. ఎకరాకు దిగుబడి సగటున 2నుంచి 4క్వింటాళ్ల వరకు వస్తుంది. తీరా అమ్మే సమయానికి ధర ఉండదు.
మద్దతు.. అంతా మాయే
మూడేళ్లలో రైతుల పంటలకు మద్దతు ధరల్లో పెరుగుదల గరిష్ఠంగా 13.49శాతమే కన్పిస్తోంది. సెనగ మినహా మిగిలిన పంటలకు పెంచిన ధరలన్నీ పదిశాతంలోపే ఉన్నాయి.
కాగితాల్లోనే మద్దతు
పంట రైతు చేయి దాటాక ధరల పరుగు మొదలవుతుంది. మళ్లీ విత్తు సమయంలో కాస్త ఆశ చూపిస్తారు. అమ్ముకునే సమయంలోనూ తడిచిన ధాన్యమని, గింజ నాణ్యత లేదని, మట్టిగడ్డలు, తేమ ఎక్కువనే సతాయింపులతో ధరలు దిగకోస్తున్నారు. గతేడాది ఖరీఫ్‌లో మద్దతు ధరకంటే 5.1% అధికంగా లభించిందని మార్కెట్ ధరల ఆధారంగా సీఏసీపీ (వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్) పేర్కొంది. క్వింటా ధాన్యానికి మద్దతు ధర రూ.1,888 ఉంటే, రూ.1,984కి అమ్ముకున్నారన్నమాట. వాస్తవానికి గతేడాది ఖరీఫ్‌లో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది.