తెలంగాణ

telangana

ETV Bharat / city

సాగునీటి లభ్యతను బట్టే పంటల మార్పిడి - Crop rotation in telangana

Crop rotation in Telangana : నీటి పొదుపుతో పంటలు సాగయ్యేలా ప్రభుత్వం సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిపుణుల బృందం సూచించింది. పాలమూరు జిల్లాల రైతులపై అధ్యయనం చేసిన ఈ బృందం.. సాగు తీరు, సాగులో సమస్యలు, ఎకరానికి పండే పంట(ఉత్పాదకత), వస్తున్న ఆదాయం, దిగుబడి, ఆదాయం తగ్గడానికి కారణాలు, రైతుల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు తదితర అనేక అంశాలపై సమగ్ర అధ్యయనం చేశారు.

Crop rotation in Telangana
Crop rotation in Telangana

By

Published : May 9, 2022, 9:30 AM IST

Crop rotation in Telangana : ‘‘సాగునీరు సమృద్ధిగా ఉంటే పంటల దిగుబడి గణనీయంగా పెరుగుతోంది. నీటికొరత ఏర్పడిన సీజన్‌లో వరి దిగుబడి ఎకరానికి 10 క్వింటాళ్ల వరకూ తగ్గుతోంది. నీటివసతి తీరుతెన్నులను బట్టే రైతులు పంటల మార్పిడి వైపు మొగ్గుచూపుతున్నారు. నీటిని పొదుపుగా వాడేందుకు, తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసేందుకు రైతులకు ప్రభుత్వం సహకరించాలి’’ అని కేంద్ర వ్యవసాయశాఖ నిపుణుల బృందం సూచించింది.

పాలమూరు జిల్లాల్లో 180 మంది రైతులను ఎంపిక చేసుకుని వారు పంటలను సాగుచేస్తున్న తీరు, సాగులో సమస్యలు, ఎకరానికి పండే పంట(ఉత్పాదకత), వస్తున్న ఆదాయం, దిగుబడి, ఆదాయం తగ్గడానికి కారణాలు, రైతుల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు తదితర అనేక అంశాలపై సమగ్ర అధ్యయనం చేశారు. ‘భారత్‌లో వ్యవసాయ రంగ పరిస్థితి’ పేరుతో వెలువరించిన తాజా నివేదికలో ఈ అధ్యయనం వివరాలను ప్రకటించింది.

ముఖ్యాంశాలు..

  • మొత్తం 180 మంది పొలాలలో 120 గొట్టపుబావులు, 113 సాధారణ బావులున్నాయి. నదీజలాలు 87 మంది కమతాలకే అందుతున్నాయి.
  • ఎరువుల ధరలు, కూలీల కొరత, వాతావరణ పరిస్థితులు, నీటిలభ్యత వంటి అంశాల దృష్ట్యా ఏ పంట వేయాలనేది నిర్ణయించుకుంటామని రైతులు చెప్పారు.
  • నీటిపొదుపును పాటిస్తూ చేసే బిందు/తుంపర సేద్యాన్ని 25 మందే అనుసరిస్తున్నారు.
  • కూరగాయలు, జొన్న వంటి ఆరుతడి పంటలతో పోలిస్తే వరి సాగుతోనే ఎక్కువ లాభం వస్తున్నట్లు పెట్టుబడి ఖర్చులను బట్టి తేలింది.
  • చెక్‌డ్యాములు లేనందున నీటికొరతతో పంటలను మార్చి వేస్తున్నట్లు 135 మంది చెప్పారు. కూలీల కొరత వల్ల మారుస్తున్నామని 35 మంది, సరైన ఆదాయం రావడం లేదని 56, పంట వైఫల్యం వల్ల అని 123, ఆర్థిక పరిస్థితుల వల్ల పంటలు మారుస్తున్నట్లు 145 మంది చెప్పారు.
  • మొత్తం 180మందిలో 38మంది మహిళలున్నారు.
  • మొత్తంలో డిగ్రీ లేదా ఆపైన చదివిన వారు 15 మంది మాత్రమే. 85 మంది పూర్తిగా నిరక్షరాస్యులు. మిగతావారు పాఠశాల విద్యతో ఆపేశారు.
  • తరచూ పంటను మార్చేవారు 99మంది, అప్పుడప్పుడు మార్చేవారు 40, ఎప్పుడూ ఒక్కటే సాగుచేసేవారు 41 మంది అని తేలింది.
  • వీరిలో 135 మంది దారిద్య్రరేఖకు దిగువనున్నారు. 80 మంది మాత్రమే పక్కాఇళ్లలో నివసిస్తున్నారు.
  • మొత్తం 180 మందిలో కేవలం 54 మందికే ఏడాదికి రూ.లక్షలోపు, 86 మంది రూ.లక్షన్నరలోపు, 17 మందికి మాత్రమే రూ.2 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది.

ఇవీ చదవండి :బస్సులో సీక్రెట్​ క్యాబిన్​.. డౌట్​ వచ్చి చూస్తే 1900 కిలోల వెండి..

ABOUT THE AUTHOR

...view details