శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే సమాజంలో అభివృద్ధి సాధ్యం. ఈ మేరకు ప్రభుత్వం పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాధాన్యతను ఉపయోగించుకొని పోలీసులు నేరాలను తగ్గించగులుగుతున్నారు. దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు... ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ ఏడాది రాష్ట్రంలో నేరాలు 6 శాతం తగ్గాయి. హత్యలు, మహిళలపై నేరాలు, దోపిడీలు, దొంగతనాలు, గొలుసు దొంగతనాలు వంటి నేరాలను పోలీసులు తగ్గించగలిగారు. వార్షిక నేర గణాంకాలను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు.
350మందిపై పీడీ యాక్టు
హత్యలు 8.59 శాతం, ఆస్తులకు సంబంధించిన నేరాలు 21శాతం, మహిళలపై నేరాలు 1.92శాతం, దోపిడీలు 33.11 శాతం, దొంగతనాలు 17శాతం, గొలుసు దొంగతనాలు 46శాతం, రహదారి ప్రమాదాలు 13.93శాతం తగ్గాయి. నేరస్థులకు శిక్షపడేలా చేయడంలోనూ పోలీసులు కీలక సాక్ష్యాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పిస్తుండటం వల్ల 48.5శాతం శిక్షలు పడ్డాయి. తరచూ నేరాలకు పాల్పడుతున్న 350మందిపై పీడీ చట్టం ప్రయోగించారు.
డయల్ 100కు 12లక్షల ఫోన్లు
నేరాలను నిరోధించడానికి పోలీసులు పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన డయల్ 100కు ఈ ఏడాది 12లక్షలకు పైగా ఫోన్లు వచ్చాయి. సరాసరి 8 నిమిషాల్లోపే ఘటనా స్థలానికి చేరుకొని గస్తీ బృందాలు బాధితులకు అండగా నిలుస్తున్నాయి. ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయలేని వాళ్లకు సామాజిక మాధ్యమాల సౌకర్యం కూడా పోలీసులు కల్పించడంతో దానికి మంచి స్పందన వస్తోంది. ఈ ఏడాది ఫేస్బుక్ ద్వారా 74 వేలు, ట్విటర్ ద్వారా 57వేలు, వాట్సాప్ ద్వారా 28వేల ఫిర్యాదులను పోలీసులు స్వీకరించి కేసులు నమోదు చేశారు. మహిళలు, యువతులను వేధించే పోకిరీల ఆట కట్టేందుకు షీ టీంల పనితీరు ప్రశంసలందుకుంటోంది.
సైబర్ నేరాలు 103శాతం పెరిగాయి
షీటీం పోలీసులకు 4,855 ఫిర్యాదులు రాగా 567 మందిపై కేసు నమోదు చేశారు. మిగతా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, పెటీ కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6.6లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. వీటిలో ఈ ఏడాది 99వేలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా 4,490 కేసులను ఛేదించగలిగారు. రహదారి ప్రమాదాల్లోనూ గతేడాదితో పోలిస్తే మృతుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది 16,866 ప్రమాదాలు చోటు చేసుకోగా... 5,821 మంది మృతి చెందారు. సైబర్ నేరాలు రాష్ట్రవ్యాప్తంగా 103శాతం పెరిగాయి.
మావోయిస్టులపై పై చేయి
అటవీ ప్రాంతాల్లో ఉండి పోలీసులను, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహించే మావోయిస్టులను అడ్డుకోవడంలోనూ పోలీసులు పైచేయి సాధించారు. తెలంగాణ కేడర్‌కు చెందిన వాళ్లంతా రాష్ట్రంలోనే ఉండి పార్టీ పటిష్ఠానికి కృషి చేయాలని కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చాలా మంది మావోయిస్టు నేతలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
3 జిల్లాలకే పరిమితం
పక్కా సమాచారంతో పోలీసులు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెట్టారు. తరచూ కూంబింగ్ నిర్వహిస్తూ మావోయిస్టుల రాకను అడ్డుకున్నారు. ఈ క్రమంలో 11సార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో 11మంది మావోయిస్టులు మృతి చెందారు. 135 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వీళ్లలో ఇద్దరు రాష్ట్ర కమిటీ నాయకులు, నలుగురు జిల్లా కమిటీ మెంబర్లు ఉన్నారు. మావోయిస్టుల నుంచి 22 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. 45మంది మావోయిస్టులు లొంగిపోయారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కేవలం 3 జిల్లాలకు మాత్రమే మావోయిస్టు కార్యకలాపాలు పరిమితమయ్యాయి.
లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు కీలక భూమిక పోషించారు. సామాజిక సేవలో భాగస్వాములయ్యారు. పోలీసుల పనితీరుకు ఈ ఏడాది 3 అంతర్జాతీయ, జాతీయస్థాయి అవార్డులు దక్కాయి.