కరోనా ప్రభావంతో విధించిన లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా నగరంలో నేరాలు తగ్గాయి. అయితే కొన్ని సడలింపుల కారణంగా తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. నేరాలూ అదే స్థాయిలో పెరిగాయి. ఏ మాత్రం భయం లేకుండా నడి రోడ్డుపైనే కిరాతంగా హత్యలకు పాల్పడుతున్నారు. ఆదిపత్య పోరులో భాగంగా గ్యాంగ్ వార్‌లు పెరుగుతున్నాయి. ఇటీవల లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రౌడీషీటర్ల జంట హత్యలే నిదర్శనం.
హత్యలతో పాటు హత్యాయత్నాలు కూడా పెరిగాయి. చిన్న చిన్న తగాదాలకే కత్తులు దూస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పశ్చిమ, దక్షిణ మండలాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలో ఈ నెలలో ఇప్పటి వరకు 10 హత్యలు జరిగాయి. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీట్ ఉన్న వారిని కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరికలు జారీచేశారు.
మద్యం మత్తులో..
ఈనెల 1న ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యపై అనుమానంతో సంజీవ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యచేశాడు. ఈనెల 2న గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణ అనే వ్యక్తిని మద్యం మత్తులో అతని స్నేహితులే హతమాచ్చారు. అనంతరం రైల్వే ట్రాక్ పక్కన పడేసి కాల్చి వేశారు. ఈనెల 4న నలుగురు హత్యకు గురయ్యారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మజర్ అనే వ్యక్తి.. మద్యం మత్తులో అతని స్పేహితుడినే బండ రాయితో మోదీ హత్యచేశాడు.
వివాహేతర సంబంధం..
రేయిన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధం కారణంగా ఇమ్రాన్ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు నడి రోడ్డుపై వెంటాడి మరి కత్తితో పొడిచి హతమార్చారు. అదేరోజు సాయంత్రం లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు మహమ్మద్ చాందీ, ఫయాజుద్దీన్లను హత్యచేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని కారుతో ఢీకొట్టి మరి దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.