ఏపీలోని కృష్ణా జిల్లా మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని శ్రీఆచార్య ప్లేస్కూల్ అండ్ కేర్ పేరుతో ఓ పాఠశాల ఉంది. లాక్డౌన్ కారణంగా ఈ భవనం ఖాళీగా ఉండగా.. దీన్ని గమనించి నవీన్ అనే వ్యక్తి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు స్కూల్‌ను అద్దెకు తీసుకున్నారు. ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహించే పరికరాలన్నీ అందులో సమకూర్చి ముగ్గురు సిబ్బందిని నియమించుకున్నారు. దీనిలో భీమవరానికి చెందిన అట్లూరి శ్రీరంజిత్కు నెలకు రూ.20 వేలు ఇస్తుండగా.. కాపలా కాసేందుకు విజయవాడ రామలింగేశ్వరనగర్‌కు చెందిన శ్రీనాథ్, మొగల్రాజపురానికి చెందిన పెద్దునాగ వెంకట ప్రసాద్‌ను నియమించకున్నారు.
దీని గురించి ఈనెల 16వ తేదీ రాత్రి సమయంలో మాచవరం పోలీసులకు సమాచారం అందడంతో.. దాడి చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అతను దొరికితే ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇంకా ఎవరిపాత్ర ఉందనే విషయం వెలుగులోకి వస్తుందన్నారు. నిందితుల దగ్గర నుంచి 30 ఫోన్ల సామర్థ్యం కలిగిన రిసీవర్ లై బాక్స్, 25 సెల్ఫోన్లు, ఓ రికార్డర్, ల్యాప్‌టాప్, టీవీలను స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్‌లో బుకీలు, పందెం రాయుళ్లు ఉంటారని.. నగదు లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. అకౌంట్లో అయితే అనుమానం వస్తుందనే ఉద్దేశ్యంతో మనీ వ్యాలెట్లు వినియోగిస్తున్నారని చెబుతున్నారు. వీరిలో ఆర్గనైజర్ ఎక్కడ ఉంటాడో తెలియకుండా.. ఫంటర్స్, బుకీల ద్వారా నిర్వహిస్తుంటారు. విజయవాడలో దొరికిన ఫంటర్ రంజీత్ చదివించి పదో తరగతైనా... వీటి నిర్వహణలో సిద్ధహస్తుడు. అందుకే అతనికి రూ.20 వేలు జీతం ఇచ్చిమరీ పనిలో పెట్టుకున్నాడు. మ్యాచ్ జరిగే సమయంలో జట్లపై పందేలు కాసేందుకు వీలుగా అవతార్ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించారు.