పిండాల్లేవు.. పితృకార్యాల్లేవు.. నోట్లో తులసి తీర్థం పోసేవాళ్లు లేనేలేరు.. చివరిచూపు లేదు.. కడసారి వీడ్కోలు అసలే లేదు.. పాడె మోసే పెద్దల్లేరు.. దింపుడు కళ్లం ఆశల్లేవు.. అందరూ ఉన్నా అనాథశవాల్లా అంత్యక్రియలు! పిల్లల్ని బాగా చూసుకుంటాం నువ్వు ప్రశాంతంగా ఉండు.. అంటూ చెవిలో చెప్పేవారు లేరు.. ఎవరైనా చనిపోతే అయినవాళ్ల రాక కోసం శవాన్ని ఫ్రీజర్ బాక్సులో భద్రపరచి రెండు రోజులైనా ఎదురుచూసే పరిస్థితి లేదు. ‘చిన్నోడు చివరి చూపు కోసం రాలేదని పెద్దాయన ఆత్మ ఘోషిస్తోంది.. అందుకే కాకులు పిండం ముట్టడంలేదనే’ ఓదార్పు మాటల్లేవు.. కరోనా కల్లోలం రేపుతోంది. వైరస్ విరుచుకుపడుతోంది. కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. మానవ సంబంధాలను మాయం చేసేస్తోంది.
cremations for corona dead bodies in telangana
By
Published : May 26, 2021, 7:01 AM IST
కుటుంబాలకు కుటుంబాలే వైరస్ బారిన పడి ఒకరు ఆసుపత్రిలో ఉంటే మరొకరు ఇంట్లో ఉంటే.. ఎవరు కన్నుమూసినా మరొకరికి చెప్పలేని పరిస్థితి. ఈ కబురు తెలిస్తే వారి పరిస్థితి దిగజారుతుందేమోననే అనుమానంతో రక్తసంబంధీకులకు, పేగుతెంచుకు పుట్టినవాళ్లకు కూడా చెప్పకుండానే.. నవమాసాలు మోసిన తల్లికి బిడ్డలు పాడేమోసే వీలులేక.. పది కాలాలు పెంచిన నాన్నను కడపటి వీడ్కోలు పలికేదారి లేక.. అయినవాళ్లెవరూ లేకుండానే అంత్యక్రియలు చేయాల్సి వస్తోంది. భర్త మృతి చెందితే భార్యకు, భార్య చనిపోతే భర్తకు.. తండ్రి కాలంచేస్తే కొడుక్కు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. కట్టుకున్న భర్త, కన్న కొడుకు దగ్గర లేకుండానే.. అసలు వారికి తెలియకుండానే అన్నీ ముగించేస్తున్నారు. కరోనా కమ్మేసిన విషాదాల్లో ఇదో కోణం.
నాన్న చనిపోయినా అమ్మకు చెప్పలేక..
హన్మకొండకు చెందిన రాజు (78), పుష్ప (75) దంపతులకు ఈనెల 9న కరోనా నిర్ధారణ అయింది. ఇంట్లోనే చికిత్స తీసుకుంటుండగా ఈ నెల 19న పుష్పకు ఆయాసం రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అదేరోజు సాయంత్రం రాజు సైతం ఆయాసం ఎక్కువ కావడంతో మరో ఆసుపత్రిలో చేర్పించారు. కొద్ది గంటల్లోనే ఆయన మృతిచెందారు. వేరే ఆసుపత్రిలో ఉన్న పుష్పకు చెప్పకుండానే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆమె రోజూ తన భర్త ఆరోగ్యం ఎలా ఉంది? భోజనం చేశారా అంటూ ఆరా తీస్తున్నారు. ఏమీ చెప్పలేక కన్నబిడ్డలు.. బాగానే ఉన్నారంటూ నమ్మిస్తున్నారు. కనీసం అమ్మనైనా కాపాడుకోవాలని ఆరాటపడుతున్నారు. హన్మకొండకు చెందిన రామయ్య విశ్రాంత ఉద్యోగి. ఆయనకు జ్వరం రావడంతో ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత భార్య లక్ష్మి, కూతురు రాణిలను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఈనెల 11న రామయ్య మరణించారు. ఆసుపత్రిలో ఉన్న భార్య, కూతురికి తెలియనివ్వకుండానే అంత్యక్రియలు పూర్తిచేశారు. పదిరోజుల తర్వాత వారిద్దరూ ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చారు. ఇంట్లోనే ఆక్సిజన్ అమర్చారు. ఇప్పటికీ రామయ్య మరణ వార్త వారికి తెలియదు. తన కంటే ముందే ఆసుపత్రికి వెళ్లిన నాన్న ఇంకా రాలేదేమని అమ్మ అడుగుతుంటే ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో అర్థంకాక ఆమె చిన్న కూతురు బోరున విలపించారు. హైదరాబాద్‌లో ఆసుపత్రిలో ఉన్నాడని, త్వరలోనే వస్తాడని చెబుతూ వస్తున్నారు.
ఇద్దరు చనిపోయినా.. కన్నీటి నిశ్శబ్దం.. సంగారెడ్డి జిల్లాలో ఒక ఇంట్లో ఎనిమిది మందికి కరోనా సోకింది. దీంతో వారందరి బాగోగులను చూసే బాధ్యత ఆ కుటుంబానికి చెందిన 38 ఏళ్ల యువకుడి మీద పడింది. ఉద్యోగాన్ని వదిలి వచ్చి అందరినీ కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. నలుగురిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. అందులో 50 ఏళ్లు పైబడిన మహిళ, ఆ తర్వాత పది రోజులకే ఆమె కూతురు (26) మృత్యువాతపడ్డారు. ఈ నలుగురి కోసం ఇప్పటి వరకు రూ.35 లక్షల వరకు ఖర్చయింది. ఆ ఇద్దరు చనిపోయారనే విషయం ఆ ఇంట్లో ఎవరికీ తెలియనివ్వలేదు. ఒకవేళ తెలిస్తే ఆసుపత్రిలో ఉన్న వారి ప్రాణాల మీదకు వస్తుందేమోననే భయంతో ఆ యువకుడు ఎవరికీ చెప్పకుండా తనలో తానే కుమిలిపోతున్నాడు.
ఒకరు లేరని మరొకరికి చెప్పకుండా..
సిద్దిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన చింతా భైరయ్య (65)తో పాటు భార్య సులోచన (60), ఇద్దరు కుమారులు రాజ్‌వీరేందర్ (41), చంద్రశేఖర్ (36) కొవిడ్ బారినపడ్డారు. ఒకే ఆసుపత్రిలో చేర్పించారు. ఏప్రిల్ 24న వీరేందర్, కొద్దిసేపటికే సులోచన కన్నుమూశారు. ఈ విషయాన్ని అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగతావారికి తెలియకుండా కోడళ్లు జాగ్రత్తపడ్డారు. బాధను గుండెల్లోనే దాచుకుని అంత్యక్రియలు పూర్తిచేయించారు. పంటి బిగువున దుఖాన్ని ఆపుకుంటూ.. వారూ కోలుకుంటున్నారని భైరయ్య, చంద్రశేఖర్‌లకు నమ్మబలికారు. వేరేవారెవరూ చెప్పకుండా జాగ్రత్తపడ్డారు. ఇంతలోనే మరో ఘోరం జరిగింది. చికిత్స పొందుతూ ఏప్రిల్ 29న చిన్నకుమారుడు చంద్రశేఖర్ చనిపోయారు. కనీసం ఇంటి పెద్ద భైరయ్య ప్రాణాలనైనా కాపాడుకోవాలనుకుని చావుల విషయం ఆయనకు చేరకుండా చూశారు. అందరూ బాగానే ఉన్నారని, మీరూ కోలుకొని వస్తారంటూ ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కాని మరో విషాదం.. ఈనెల 9న భైరయ్య కూడా కన్నుమూశారు. ఒకరి తర్వాత ఒకరు నలుగురు మరణాలను చూసిన భైరయ్య కోడళ్ల వేదన మాటల్లో వర్ణించలేకుండా ఉంది.
కొడుకు చావు కబురు దాచినా.. తండ్రి దక్కలేదు
వరంగల్ జిల్లాకు చెందిన బుచ్చయ్య (73) సాగునీటి శాఖలో ఏఈగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు. హైదరాబాద్‌లో ఉండే పెద్దకొడుకు రామ్మోహన్ కరోనా సోకి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈనెల 9న మరణించాడు. ఆ విషయం తండ్రికి తెలియనివ్వలేదు. కోలుకుంటున్నారని ఆసుపత్రిలో ఉన్నారనే చెప్పారు. అంతలో కరోనా లక్షణాలు కనిపించడంతో బుచ్చయ్యను కూడా ఆసుపత్రిలో చేర్పించారు. 12 రోజుల చికిత్స తర్వాత ఆయనకు తగ్గింది. రేపోమాపో ఇంటికి వచ్చేస్తారని అనుకుంటున్న తరుణంలో బుచ్చయ్య తన పెద్ద కుమారుడి ఆరోగ్యం ఎలా ఉందని, తనను చూసేందుకు ఎందుకు రావడంలేదని అనుమానిస్తూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడటంలేదనే మనోవేదనతో ఆయన ఆసుపత్రిలోనే గుండెపోటుతో మరణించారు.