ఏపీ రాజధాని నిర్మాణంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సీఆర్‌డీఏ అధికారుల్లో కొంత కదలిక వచ్చింది. నెల రోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్లాట్లను అభివృద్ధి చేసి రైతులకు 3 నెలల్లో అప్పగించాలని న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల పరిశీలకురాలిగా సీఆర్‌డీఏ కమిషనర్ విజయకృష్ణన్ వెళ్లారు. ఆమె ఈ నెల 14న విధుల్లో చేరనున్నారు. దీంతో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెలలో పూర్తి చేయనున్నారు.
మీ ప్లాట్లు రిజిస్టర్ చేసుకోండి.. అమరావతి రైతులకు సీఆర్‌డీఏ అధికారుల ఫోన్లు
16:51 March 08
మీ ప్లాట్లు రిజిస్టర్ చేసుకోండి.. అమరావతి రైతులకు సీఆర్‌డీఏ అధికారుల ఫోన్లు
రిజిస్ట్రేషన్ చేయాల్సిన ప్లాట్లు 24,357..
రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం 28,587 మంది రైతుల నుంచి 34,385 ఎకరాలను సమీకరించింది. దీనికి గానూ వారికి నివాస, వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలన్నది ఒప్పందం. ఈ మేరకు భూ యజమానులకు మొత్తం 64,735 ప్లాట్లను కేటాయించింది. ఇందులో 38,282 నివాస, 26,453.. వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. వీటిల్లో గత ప్రభుత్వ హయాంలో 40,378 ప్లాట్లను రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది. హైకోర్టు గడువుతో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇంకా 24,357 ప్లాట్లను వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఈ ప్రక్రియను సీఆర్‌డీఏ అధికారులు తిరిగి ప్రారంభించారు. అధికారులు సంబంధిత రైతులకు ఫోన్లు చేస్తున్నారు. మీకు కేటాయించిన ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోమని కోరుతున్నారు.
ఇదీ చూడండి: Amaravati Farmers : రైతులపై అడుగడుగునా పోలీసు జులుం.. 27 నెలల్లో 3,852 కేసులు