CRDA notices to Amaravati farmers: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. హైకోర్టు తీర్పుని అమలులో భాగంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు. దీనిపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కేవలం కాగితాలకే సంబంధించినది కాదని... భౌతికంగా ఎవరి ప్లాట్ ఎక్కడుందో చెప్పాలని రైతులు కోరుతున్నారు.
రాజధానిలో రెండున్నరేళ్లుగా నిర్మాణ పనులు ఆగిపోయిన తరుణంలో ప్లాట్లు ఎక్కడనేది గందరగోళం నెలకొంది. అలాగే కొన్నిచోట్ల భూ సేకరణ కింద తీసుకున్న భూముల్లోనూ ప్లాట్లు కేటాయించారు. అయితే సంబంధిత భూ యజమానులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. ఆ భూముల్లో ప్లాట్లు పొందిన వారు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ సీఆర్డీఏ అధికారులకు లేఖలు రాస్తున్నారు. సంబంధిత భూ యజమానుల నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సీఆర్డీఏ వద్ద ఉంటే చూపాలని లేఖల్లో కోరుతున్నారు.
ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్‌డీఏ నోటీసులు మరికొన్ని చోట్ల దేవాదాయశాఖ భూముల్లోనూ ప్లాట్లు కేటాయించారు. పరిహారం చెల్లించి ఆ భూముల్ని సీఆర్డీఏ ఇంకా స్వాధీనం చేసుకోలేదు. అలాంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎలా సాధ్యమని రైతులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరించుకుండా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటూ నోటీసులివ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కేటాయించిన ప్లాట్ల వద్దకు వెళ్లేందుకు కనీసం దారి లేదని... అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయడంతో ఆ ప్రాంతమంతా ముళ్లచెట్లతో నిండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెలాఖరుతో పూర్తి చేసేందుకు సీఆర్డీఏ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రక్రియ ముందుకు సాగేట్లు కనిపించడం లేదు. కోర్టు తీర్పుని అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నా... రైతులు సహకరించటం లేదని సీఆర్డీఏ అధికారులు న్యాయస్థానానికి చెప్పే అవకాశం ఉంది. రైతులు సైతం తమ అభ్యంతరాలను నివృత్తి చేయలేదని చెప్పేందుకే సీఆర్డీఏకు లేఖలు రాసి పొందిన రశీదులను న్యాయస్థానానికి సమర్పించనున్నారు..
ఇదీ చదవండి:Wedding bus accident: చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా... మహిళ, చిన్నారి సహా ఏడుగురు మృతి