'దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రజా ఉద్యమాలు జరగాల్సిన అవసరముంది' దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రజా ఉద్యమాలు జరగాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నాలో సీతారం ఏచూరి పాల్గొన్నారు. ఈ నెల 27న రైతులు భారత్ బంద్(bharat bandh on 27 september 2021)కు పిలుపునిచ్చారని.. ఇది మహా ప్రజా ఉద్యమంగా మారిందని ఏచూరి తెలిపారు.
గద్దె దించే వరకు పోరాటం...
"మోదీని గద్దె దించే వరకు పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యానికి ఉన్న నాలుగు స్తంభాలను మోదీ ధ్వంసం చేయిస్తున్నారు. ఐదారు నెలలుగా దీక్ష చేస్తున్న రైతులతో మాట్లాడటమే మానేశారు. అమెరికా వెళ్తున్న మోదీ... ఇక్కడ మిగిలి ఉన్నవి ఏమి అమ్ముతాడోనని ఆందోళనగా ఉంది. స్వాతంత్య్ర ఉద్యమం మాదిరిగా పోరాటాలు జరపాలి. రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి."- సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి
దొంగ మాటలు వినే పరిస్థితిలో లేరు..
ఈ మహాధర్నాలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. గిరిజనులకు పోడుభూముల పట్టాలు ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగాలని సూచించారు. ఈ పోరాట కార్యక్రమాలు గ్రామీణ స్థాయి వరకూ చేరాలని తెలిపారు. ఈ నెల 27న తలపెట్టిన బంద్.. వ్యాపారులు, ప్రజల మీద కాదని మోదీ ప్రభుత్వం మీదనేనని స్పష్టం చేశారు.
"పోడు భూములపై అఖిలపక్ష పోరాటం అనగానే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఎన్నికల పేరు చెప్పి.. ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కేస్తారు. కేసీఆర్ చెప్పే దొంగ మాటలు విని మోసపోయే స్థితిలో లేరు. ఎప్పుడైతే పోడు భూముల పట్టాలు చేతిలో పడినప్పుడు నమ్ముతాం. అప్పటి వరకు పోరాటం సాగుతుంది. అక్టోబర్ 5న ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు 400 కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించాలి. ఆ 400 కిలో మీటర్ల మేర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాలి. ఈ పోరాటం తర్వాత తెరాస నాయకులు గ్రామాల్లో తిరగాలంటే భయపడాలి. అలా జరగాలంటే.. అన్ని పార్టీల కార్యకర్తలు ప్రజలను అప్రమత్తం చేయటం వల్లే సాధ్యం." - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
ఇదీ చూడండి:
- MP Revanth Reddy On Police: దాడి చేసిన వారిపై కాకుండా... మాపై అక్రమ కేసులా?