CPM Leaders fire on BJP: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. ప్రజల హక్కులను కాలరాస్తోందని సీపీఏం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నాయకులు మండిపడ్డారు. ఈ నెల 23 నుంచి 25 వరకు సీపీఎం రాష్ట్ర మహాసభలు జరగనున్నట్టు ప్రకటించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా పార్టీ బహిరంగ సభ వర్చువల్గా ఈ నెల 22న నిర్వహిస్తామని... ప్రతినిధుల సభలు భౌతికంగా 23 నుంచి జరుగుతాయని తెలిపారు.
హామీలు విస్మరించి విద్వేషాలు..
దేశంలో నిత్యావసరాల ధరలు నియంత్రించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని రాఘవులు విమర్శించారు. రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలపై ఇతర పక్షాలతో కలిసి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. సమాఖ్య వ్యవస్థను రక్షించుకునేందుకు కేసీఆర్, జగన్ కలిసి రావాలని కోరారు. పార్టీ విధానాలు నచ్చక రాజీనామా చేసిన నేతలపై పాత కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
"కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. భాజపా విధానాలు నచ్చక ఉత్తరప్రదేశ్ మంత్రి మౌర్య రాజీనామా చేసి ఎస్పీలోకి వెళ్లితే పాత కేసులు పెట్టి వేధిస్తోంది. ప్రత్యర్థులపై ఇలాంటి వేధింపులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు నిలవాలి. ధరలను నియంత్రించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. డీజిల్, పెట్రోల్ మీద కేంద్రం ఆదాయం సమకూర్చుకోవాలనుకుంటోంది. రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలపై ఇతర పక్షాలతో కలిసి పోరాటం చేస్తాం. సమాఖ్య వ్యవస్థకు కేంద్రం విఘాతం కలిగిస్తోంది. సమాఖ్య వ్యవస్థను రక్షించేందుకు కేసీఆర్, జగన్ కలిసి రావాలి.. లేకపోతే రెండు రాష్ట్రాలు నష్టపోతాయి. ఇందుకోసమే కేంద్ర నాయకులు తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు భాజపా తీవ్ర అన్యాయం చేసింది. విభజన హామీలను విస్మరించి... విద్వేషాలు రెచ్చగొడుతోంది. ఏపీలో జిన్నా టవర్, తెలంగాణలో భాగ్యనగర్ పేరుతో భాజపా మత విద్వేషాలు రెచ్చగొడుతోంది."- బీవీ రాఘవులు, సీపీఏం పోలిట్ బ్యూరో సభ్యులు