CPM Leaders Comments: వామపక్ష నేతలు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించాలని రాందేవ్ బాబా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. సమానత్వం గురించి మాట్లాడే హక్కు రాందేవ్ బాబాకు లేదన్నారు. సమానత్వం ఎక్కడ ఉందో రాందేవ్ బాబా చెప్పాలని డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి పార్టీ రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ఆవిష్కరించారు. రాందేవ్ బాబా మొదట.. దళిత, గిరిజన వాడలను సందర్శించిన తర్వాత సమానత్వం గురించి మాట్లాడాలని రాఘవులు హితవు పలికారు.
"కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యుత్ సంస్కరణలు అమలు చేయమని కరాఖండిగా చెప్పడం సంతోషకరం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాకు శృంగభంగం కలగటం ఖాయం. కర్ణాటకలో హిజాబ్ పేరుతో భాజపా మత వివాదాన్ని సృష్టించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే భాజపా హిజాబ్ సమస్యను తీసుకొచ్చింది." - బీవీ రాఘవులు, సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు