Kunamneni Sambasivarao Interview: రాష్ట్రంలో సీపీఐకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని.. మిలిటెంట్ తరహా పోరాటాలతో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. మతం ముసుగులో భాజపా రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తోందని, నయానో, భయానో గెలిచేందుకు ఈడీ, సీబీఐ వంటి సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ బలపడకుండా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మునుగోడును తెరాస కోసం వదులుకున్నామన్నారు. సీపీఐ నూతన కార్యదర్శిగా ఎన్నికైన ఆయన ఈటీవీ-భారత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ ప్రణాళికలు, వ్యూహాలను వివరించారు. కరోనా కంటే భాజపా ప్రమాదరకమైనదని, దాన్ని అడ్డుకోవడానికి ఇతర పార్టీలతో పొత్తులు అవసరమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడుతోందని.. అందుకే తమ పార్టీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల పొత్తుల్లో సీపీఎంకు తొలి ప్రాధాన్యం, తెరాసకు మలి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మీ ప్రాధాన్యాలు, లక్ష్యాలు ఏమిటి?
అనేక కారణాల వల్ల పార్టీ బలహీనపడింది. గతంలో ప్రతి రెండు, మూడు కుటుంబాల్లో ఒకదానికి పార్టీతో అనుబంధం ఉండేది. కార్పొరేట్ విద్యతో విద్యార్థులు కొంత దూరమయ్యారు. ఆయా వర్గాలతో మళ్లీ అనుసంధానమై పార్టీని బలోపేతం చేస్తాం. అనుబంధ విభాగాల్లో లక్షల మంది సానుభూతిపరులున్నా ఓట్లుగా మారట్లేదు. ఆ పరిస్థితిలో మార్పు తీసుకువస్తాం.
బలమైన మునుగోడునే వదులుకున్నారు.. ఈ స్థితిలో రాష్ట్రంలో పార్టీ నిలదొక్కుకునే పరిస్థితి ఉంటుందా?
ఎన్నికల క్షేత్రంలో పడుతూ.. లేస్తున్నాం. గ్రామపంచాయతీలు, మండల పరిషత్తుల్లో పొత్తులు లేకుండా సొంతంగా బలపడేందుకు ప్రయత్నిస్తాం. గతంలో కొత్తగూడెం స్థానాన్ని ఇతర పార్టీలకు వదిలిపెట్టినా 2009లో నేను అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. మునుగోడు విషయమూ తాత్కాలికమే. భాజపాను నిలువరించడం, మా ఓటుబ్యాంకు చెదిరిపోకుండా ఉండేందుకే తెరాసతో పొత్తు.. ఇది సంపూర్ణ మద్దతు కాదు. సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ మునుగోడులో పోటీ చేస్తుంది. భాజపా ప్రమాదం రోజురోజుకు పెరుగుతోంది.