రాష్ట్రంలో ప్రజా ఉద్యమాల నిర్మాణం, ప్రజాసమస్యల పరిష్కారంలో నేతలు, కార్యకర్తలు కీలక భూమిక పోషించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. సామాన్యులు, కష్టజీవులకు అండగా ఉంటూ.. ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని తీసుకురావాలని కోరారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన డి.రాజా.. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూమ్ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డిలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పార్టీ ఉద్యమ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించారు. వ్యవసాయ చట్టాలపై గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఆయా చట్టాలను రద్దుచేసేంతవరకూ పోరాటం చేయాలన్నారు.
పోడు భూముల సమస్యపై గిరిజనులను.. అటవీ అధికారులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి.. డి. రాజా దృష్టికి తీసుకువచ్చారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలున్న జిల్లాల్లో పోడు యాత్రను నిర్వహించామని చెప్పారు.