హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లో డ్రైనేజీ ఘటనలో ఇద్దరు మృతికి కారణమైన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఈ ప్రమాదానికి గుత్తేదారుని నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. రాత్రి సమయంలో డ్రైనేజీ శుభ్రం చేసేందుకు అనుమతి లేనప్పటికీ.. కాంట్రాక్టర్ ఒత్తిడితోనే శివ, అంజయ్యలు మురికి కాలువలోకి దిగి మృత్యువాతపడ్డారని సీపీ పేర్కొన్నారు. ఈ ఘటనలో గుత్తేదారునిపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో మ్యాన్‌హోల్ సివరేజ్ చట్టం కింద కేసు నమోదుచేసినట్లు తెలిపారు.
డ్రైనేజీలోకి దిగిన ఇద్దరిలో ఒకరి మృతదేహం దొరికింది. ఇంకొక మృతదేహం దొరకలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అని చెబుతున్నారు. అతనిపై కేసు నమోదుచేశాం. వనస్థలిపురం ఏసీపీ దర్యాప్తు చేస్తున్నారు.
మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
అసలేం జరిగింది..
వనస్థలిపురం పరిధిలోని సాహెబ్‌నగర్‌లో డ్రైనేజీ శుభ్రం చేసేందుకు శివ, అంజయ్య మ్యాన్ హోల్ లోపలికి దిగారు. ఊపిరాడక అందులోనే మృతిచెందారు. డ్రైనేజీలోకి దిగి ఎంతకీ బయటకు రాకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు శివ మృతదేహాన్ని బయటకు తీశారు. అంజయ్య కోసం గాలిస్తున్నారు.
జులైలో కురిసిన వర్షాలకు బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లో మ్యాన్‌హోళ్లు పొంగుతున్నాయి. దీంతో ఇంజినీరింగ్ అధికారులు మ్యాన్‌హోల్‌లో పూడిక తీత పనులు చేపట్టాలని నిర్ణయించారు. సాహెబ్‌నగర్ పద్మావతి కాలనీ నుంచి, హరిహరపురం వరకు రూ.12 లక్షల నిధులతో గుత్తేదారుకు బకెట్ క్లీనింగ్ పనులు అప్పగించారు. మంగళవారం పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనుల్లో నిబంధనలను పాటించకుండా పనులు చేపట్టడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.
'కూలీల మృతికి గుత్తేదారు నిర్లక్ష్యమే కారణం. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ పని చేపట్టారు. దురదృష్టకర ఘటనతో జీహెచ్‌ఎంసీకి సంబంధం లేదు. గుత్తేదారుపై తగు చర్యలు తీసుకుంటాం' అని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు.