కాసేపట్లో తెలంగాణకు కొవిషీల్డ్ టీకా డోసులు
10:08 January 12
కార్గో విమానంలో శంషాబాద్‌కు కొవిషీల్డ్ టీకా డోసులు
ఈరోజు మధ్యాహ్నానికి తెలంగాణకు కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకోనున్నాయి. ప్రత్యేక కార్గో విమానంలో 6.5 లక్షల డోసులు శంషాబాద్‌కు రానున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. శంషాబాద్ నుంచి కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి తరలిస్తామని తెలిపింది.
దీనికోసం కోఠి ఆరోగ్య కార్యాలయంలో 40 క్యూబిక్ మీటర్ల వాకిన్ కూలర్ ఏర్పాటు చేసిన వైద్యాధికారులు వెల్లడించారు. ఈనెల 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నందున ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తొలిరోజు 139 కేంద్రాల్లో 13వేల 900 మందికి కొవిడ్ టీకా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
వ్యాక్సిన్ తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశామని ఆరోగ్యాధికారులు పేర్కొన్నారు. మొత్తంగా తొలుత 2.90 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు. వారంలో నాలుగు రోజులు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతుందని తెలిపారు. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా పంపిణీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
- ఇదీ చూడండి :తెలంగాణలో 2 లక్షల 90వేలు దాటిన కరోనా బాధితులు