కొవిడ్ టీకాలు ఏపీకి చేరుకున్నాయి. మొత్తం 4.75 లక్షల డోసులు పుణె నుంచి ప్రత్యేక విమానంలో తరలివచ్చాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న టీకా డోసులను... గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడ ముందుగానే చేసిన ఏర్పాట్లకు అనుగుణంగా... తగిన రీతిలో వ్యాక్సిన్‌ను భద్రపరిచారు. బుధవారం గన్నవరం నుంచి అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్ పాయింట్లకు అధికారులు తరలించనున్నారు. 2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగేలా వ్యాక్సిన్ డెలివరీ వాహనాలు ఏర్పాటు చేశారు.
ఏపీకి చేరుకున్న కొవిడ్ టీకాలు... శీతలీకరణ కేంద్రానికి తరలింపు - కరోనా టీకాలు తాజా వార్తలు
ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 16న నిర్వహించే వ్యాక్సినేషన్‌కు ఆ రాష్ట్ర వైద్య అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి కరోనా టీకా చేరుకున్నాయి. గన్నవరంలోని రాష్ట్ర శీతలీకరణ కేంద్రానికి వ్యాక్సిన్ డోసులను తరలించారు.
గన్నవరం రాష్ట్రస్థాయి శీతలీకరణ కేంద్రంలో రెండు పెద్ద వాక్సిన్ కూలర్లు ఉంచారు. ఒకటి 40 క్యూబిక్ మీటర్లు, మరొకటి 20 క్యూబిక్ మీటర్ల కెపాసిటీతో ఉన్నాయి. వ్యాక్సిన్ భద్రపరచడానికి గన్నవరం కేంద్రానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 8 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. బయటి వ్యక్తులకు అనుమతి నిరాకరిస్తున్నారు. తొలిదశలో 3 లక్షల 87 వేల మంది వైద్య సిబ్బందికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుంది.
ఇదీ చదవండి:హైదరాబాద్ కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి కొవిషీల్డ్ టీకాలు