కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో.. నేడు దేశవ్యాప్తంగా డ్రైరన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రాలు కనీసం 3 కేంద్రాల్లో డ్రైరన్ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్ర సర్కారు... హైదరాబాద్, మహబూబ్ నగర్లలో కలిపి 7 కేంద్రాల్లో డ్రైరన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో గాంధీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీహెచ్సీ.. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో డ్రైరన్ నిర్వహించనున్నారు. ఇక మహబూబ్ నగర్‌కి సంబంధించి జానంపేట పీహెచ్సీ, మహబూబ్‌నగర్ జీజీహెచ్, ప్రైవేట్ సెక్టార్లో నేహా షైన్ హాస్పిటల్లలో డ్రైరన్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇక రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 10 వేల మంది వాక్సినేటర్లు సిద్ధంగా ఉండగా... రోజుకు 10 లక్షల డోస్‌లు ఇచ్చే సామర్థ్యం తమ వద్ద ఉందని ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
డ్రైరన్ అంటే..
వ్యాక్సిన్ డ్రైరన్‌లో భాగంగా ఆయా కేంద్రాల్లో టీకా ఇచ్చే సమయంలో.. ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యలు, సాంకేతిక సమస్యలను పరిశీలించనున్నారు. సాధారణంగా వాక్సినేషన్ సమయంలో కొవిన్ సైట్లో రిజిస్టర్ చేసుకున్న వారు ముందుగా తమ ధ్రువపత్రాలతో వ్యాక్సిన్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి వివరాలను సరిపోల్చుకున్న అనంతరం అధికారులు లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారు దాదాపు అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రంలో వేచి ఉండాలని.. ఆ సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులను అధికారులు గుర్తించి వివరాలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ ఎంత సేపు తీసుకుంటోంది.. వ్యాక్సిన్ అమలులో వుండే సమస్యలను గుర్తించి పరిష్కరించి... అసలైన వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ఈ డ్రైరన్ ప్రధాన లక్ష్యం. అయితే డ్రైరన్‌లో ఎక్కడా వ్యాక్సిన్ ని వినియోగించరు. కేవలం ఆ ప్రక్రియను ఒక ట్రయల్‌గా మాత్రమే చేసి చూస్తారు. అనంతరం ఆయా వివరాలను కొవిన్ సైట్లో అధికారులు పొందుపరచనున్నారు.