తెలంగాణ

telangana

ETV Bharat / city

నెమ్మదించిన వ్యాక్సినేషన్.. రోజుకు 30-35వేల టీకాలు - telangana vaccination

తెలంగాణలో టీకాల పంపిణీ నెమ్మదించింది. గత నెలలో 2 లక్షల డోసుల వ్యాక్సిన్లు ఇచ్చిన వైద్యులు.. ఇప్పుడు 30 నుంచి 35వేలు మాత్రమే ఇస్తున్నారు. టీకాల కొరతతో రెండ్రోజులుగా వ్యాక్సినేషన్​ను నిలిపివేశారు.

vaccination, covid vaccination, vaccination in telangana
కొవిడ్ వ్యాక్సినేషన్, తెలంగాణలో వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్

By

Published : May 16, 2021, 7:08 AM IST

Updated : May 16, 2021, 7:54 AM IST

రాష్ట్రంలో కరోనా టీకాల పంపిణీ నెమ్మదించింది. ఏప్రిల్‌లో రోజుకు 2 లక్షల డోసులు ఇవ్వగా ఇప్పుడు 30-35 వేలు మాత్రమే ఇస్తున్నారు. 45 ఏళ్లకు పైబడిన వారికి తొలిడోసు టీకాలను నిలిపివేసి రెండోడోసు వారికే ప్రాధాన్యమిస్తున్నా కొరతతో పంపిణీ తగ్గింది. గత నెల రోజువారీ సగటుతో పోల్చితే ప్రస్తుతం అందులో సగం కూడా వేయడం లేదు. రెండోడోసు వారికే ప్రాధాన్యమిస్తుండటంతో ఈ నెలలోనే రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య ఇప్పటి వరకు 6.24 లక్షల నుంచి 11.37 లక్షలకు చేరువైంది.

ఈ నెలలో రెండో డోసులే ఎక్కువ..

మే నెల సగం పూర్తవుతున్నా ఏప్రిల్‌లో వేసిన టీకాల సంఖ్యతో పోల్చితే 21.4 శాతమే ఇప్పటి వరకు పంపిణీ జరిగింది. ఏప్రిల్‌లోనే రోజుకు సగటున 1.14 లక్షల చొప్పున 34.47 లక్షల టీకాలు వేశారు. వీరిలో 30 లక్షల మంది తొలిదశ వేయించుకున్నవారున్నారు. మే నెలలో ఇప్పటి వరకు సగటున రోజుకు 52 వేల చొప్పున 7,39,517 మందికి వేశారు. ఇందులో ఎక్కువగా రెండోదశ టీకాలున్నాయి. కేంద్రం కొవిషీల్డ్‌ టీకా రెండోడోసు వ్యవధిని ఇటీవల 12-16 వారాల (84-112 రోజులు)కు పెంచింది.

రెండో డోసుకే ప్రాధాన్యత

ఈ నేపథ్యంలో 45 ఏళ్లు... ఆ పైబడిన వారికి టీకాల పంపిణీ మార్గదర్శకాలపై సర్కారు కసరత్తు చేస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో తొలిడోసు టీకా తీసుకున్న 30.65 లక్షల మందిలో కొవిషీల్డ్‌ తీసుకున్నవారికి జూన్‌ నెలాఖరు లేదా ఆగస్టులో రెండో డోసు ఇస్తారు. ఈ నేపథ్యంలో అందుబాటులోని టీకాల లభ్యత, సరఫరా తదితర విషయాలను వైద్య ఆరోగ్యశాఖ పరిశీలిస్తోంది. 45 ఏళ్లకు పైబడిన లబ్ధిదారుల వివరాలను చూసి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ మేరకు శని, ఆదివారాల్లో టీకాల పంపిణీని వైద్యఆరోగ్యశాఖ నిలిపివేసింది. సోమవారం నుంచి మొదలవుతుందని, ఆలోగా విధివిధానాల్లో మార్పులు ఉంటే తెలియజేస్తామని ఇప్పటికే ప్రకటించింది.

Last Updated : May 16, 2021, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details