రాష్ట్రంలో ఊపందుకున్న నిర్మాణ రంగంపై కొవిడ్ మరోసారి పంజా విసురుతోంది. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ నిర్మాణాలు రాష్ట్రంలో మొదలైనా.. కరోనా దెబ్బతో ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో.. శరవేగంగా నిర్మాణాలు జరుగుతుండగానే సిమెంటు, స్టీలు, ఇసుక, కంకర, ఇతర ముడి పదార్ధాల ధరలు పెరిగాయి. ఆ ప్రభావం చిన్న బిల్డర్లపై పెద్దఎత్తున పడింది. ప్రస్తుతం కరోనా దెబ్బకు మరింత ప్రభావం పడింది. రెండు, మూడు వందల మంది కూలీలతో రద్దీగా ఉండే నిర్మాణ ప్రాంతాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. గడిచిన 20 రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. కొందరు బిల్డర్లు కరోనా బారినపడి హోం ఐసోలేషన్‌లో ఉంటుండగా యాభై సంవత్సరాలు దాటిన బిల్డర్లు ఇంటి గడప దాటడం లేదు. ఫలితంగా నిర్మాణాలు దాదాపుగా నిలిచిపోయాయి. తుది దశకు చేరిన భవనాల్లో చిన్నచిన్న పనులు అందుబాటులో ఉన్న కూలీలతో పూర్తి చేస్తున్నారు.
కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు మాస్కులు ఇస్తున్నారు. రక్షణ కోసం శిరస్త్రాణం వంటివి ధరించి పనిచేస్తున్నాం. కంపెనీ నుంచి శానిటైజర్ తదితర సదుపాయాలు కల్పిస్తున్నారు. కొవిడ్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందుల్లేవు. కొవిడ్ టెస్టులు కూడా చేయించుకున్నాం. ఎవరికీ పాజిటివ్ రాలేదు. అందరికీ నెగెటివ్ వచ్చింది.