పోలీస్‌శాఖలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విధి నిర్వహణలో ప్రజలను కలుసుకోవడం.. నిరసన ప్రదర్శనలు.. ధర్నాలు.. ముట్టడి కార్యక్రమాల్లో ఆందోళనకారులను అరెస్ట్ చేయడం.. వరుసగా సాగిన వేడుకల్లో రాత్రింబవళ్లు పనిచేయడంతో కొందరు పోలీసులకు వైరస్ సోకింది. ఇందులో ఇద్దరు మహిళా ఇన్‌స్పెక్టర్లు. ముగ్గురు ఎస్సైలు.. ఆరుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్ రావడంతో వారు ఇళ్లకు పరిమితమయ్యారు. మరికొందరు లక్షణాలతో బాధపడుతున్నారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు బోనాల సందర్భంగా బందోబస్తుకు ఇతర జిల్లాల నుంచి వచ్చి వెళ్లిన వారి ఆరోగ్యంపై ఆరాతీస్తున్నారు.
15 రోజుల్లో 11 మందికి
కరోనా నుంచి రక్షించుకునేందుకు పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందితోపాటు వారి కుటుంబసభ్యులకూ టీకాలు వేయిస్తున్నారు. గతనెల రెండోవారం నుంచి వేడుకలు, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు ఊపందుకోవడంతో పోలీసులు విధుల్లో తలమునకలయ్యారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తులు, చెక్‌పోస్టుల వద్ద తనిఖీల్లో పాల్గొన్న కొందరు అనారోగ్యం పాలయ్యారు. మరికొందరికి లక్షణాలు కనిపించకపోవడంతో విధులకు హాజరయ్యారు. 15 రోజుల్లోనే 11 మంది సిబ్బందికి కరోనా సోకింది.