తెలంగాణ

telangana

ETV Bharat / city

సమాచారం లేక విజయవాడ ఆస్పత్రిలో బంధువుల సతమతం - covid cases in Andhra Pradesh

‘మా అమ్మకు పాజిటివ్‌ వస్తే.. ఆసుపత్రిలో ఐదు రోజుల కిందట చేర్చాను. ఇంతవరకు ఆమెకు ఎలా ఉందో.. చెప్పే వాళ్లే లేరు. ఎవరిని అడిగినా.. మాకు తెలియదనే అంటున్నారు. మరీ ఇంత దారుణమైన పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదు.’ - ఏపీలోని విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో ఉన్న తన తల్లి గురించి ఓ యువకుడి ఆవేదన ఇది.

covid patients relatives tensions in vijayawada
విజయవాడ ఆస్పత్రిలో బంధువుల సతమతం

By

Published : May 3, 2021, 12:54 PM IST

ఏపీలోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 800 మంది వరకు కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 700 మందికి పైగా ఆక్సిజన్‌పైనే ఉన్నారు. శరీరంలో ఆక్సిజన్‌స్థాయి పడిపోతుండడం, ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో వీరిని ఆసుపత్రిలో చేర్చారు. తర్వాత వాళ్లు ఎలా ఉన్నారో.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందా.. లేదా.. అనే సమాచారం తెలియక.. బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో గత ఏడాది కొవిడ్‌ సమయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. దానికి ఫోన్‌ చేసినా.. ఎవరూ స్పందించడం లేదు.

సమాచారం ఇచ్చే ఏర్పాటు చేయాలి..

ఆసుపత్రి లోపల బాధితులు.. బయట బంధువుల ఆందోళన రోజు రోజుకూ వర్ణనాతీతంగా మారుతోంది. తమవాళ్లకు సంబంధించిన సమాచారం ఫోన్లు లేదా నేరుగా వచ్చి తెలుసుకునే వ్యవస్థను నిమ్రా, పిన్నమనేని, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న మాట కూడా బయట ఉండే వారికి ఎంతో ఓదార్పును ఇస్తుంది. ఈ విషయంపై అధికారులు దృష్టిసారించాలని.. వందల మంది బాధితుల బంధువులు కోరుకుంటున్నారు. లోపలున్న తమవాళ్ల పరిస్థితి బాగున్నంత వరకు, వారి దగ్గర ఉండే ఫోన్లలో మాట్లాడుతున్నారు. వారి పరిస్థితి ఏ మాత్రం విషమించినా.. ఇక వారికి ఎలా ఉందో తెలుసుకునే పరిస్థితి లేదు. పైగా.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వందల మంది కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతుండగా.. రాత్రి సమయంలో సిబ్బంది ఎవరూ వార్డుల్లోకి వెళ్లడం లేదని పలువురు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి ఏదైనా జరిగినా.. ఉదయం వచ్చి చూస్తున్నారే తప్ప.. రాత్రి వేళ ఒక్కరు కూడా అందుబాటులో ఉండడం లేదని.. బాధితులు తమ బంధువులకు ఫోన్లు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రి, చిన ఆవుటపల్లిలోని పిన్నమనేని, ఇబ్రహీంపట్నం నిమ్రా మూడు ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ మూడింటిలో 1500 మందికి పైగా బాధితులున్నారు. ఒకసారి లోపలికి వెళ్లాక.. వారికి సంబంధించిన ఎలాంటి సమాచారమూ వైద్యులు ఇవ్వడం లేదు.

లోపల గందరగోళం..

విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో అంతా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామంటూ.. జిల్లా కలెక్టర్‌ సహా అధికారులంతా నిత్యం ప్రకటిస్తున్నారు. కానీ.. లోపలున్న వారికి ఎలాంటి వైద్య సహాయం అందిస్తున్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, కోలుకుంటారా, విషమంగా ఉందా? ఎలాంటి మందులు వాడుతున్నారు.. వంటి సమాచారం బాధితుల బంధువులకు అందడం లేదు. ప్రస్తుతం చాలా ప్రైవేటు ఆసుపత్రుల్లో విషమంగా ఉన్నవారికి కూడా రెమ్‌డెసివిర్‌ లాంటి ఇంజక్షన్లు ఇస్తే.. కోలుకుంటున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ ఇంజక్షన్లకు ఎలాంటి కొరత లేదని, అవసరమైన వారికి వైద్యుల పర్యవేక్షణలో ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు, ఇంకా ఎంత స్టాక్‌ ఉందనే వివరాలు కూడా అధికారులు ప్రకటిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి :దేవరయాంజల్ ఆలయ భూకబ్జాలపై విచారణకు కమిటీ

ABOUT THE AUTHOR

...view details