ఏపీ పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడిలో కరోనా బాధిత మహిళల పట్ల అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు తావిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా ముగ్గురు మహిళలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణయ్యింది. అయితే వీరిని క్వారంటైన్ కేంద్రానికి తరలించేందుకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఈ ముగ్గురిని స్థానిక శ్మశాన వాటికలోని షెడ్డులోనే ఉంచారు.
శ్మశానవాటిక షెడ్డులో బిక్కుబిక్కుమంటూ కరోనా బాధితులు..! - corona patients problems in west godavari news
కరోనా ర్యాపిడ్ టెస్టుల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వారిని క్వారంటైన్‌కు తరలించి.. చికిత్స అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారు. ముగ్గురిని స్థానిక శ్మశాన వాటికలోని షెడ్డులో ఉంచారు. దాదాపు 6 గంటల పాటు కొవిడ్ బాధిత మహిళలు.. ఆ షెడ్డులోనే కనీసం తాగేందుకు నీరు కూడా లేక బిక్కు బిక్కుమంటూ కాలం గడిపారు. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడిలో జరిగిన ఘటన వివరాలివి..!
CORONAVIRUS
సుమారు 6 గంటలు బాధిత మహిళలు బిక్కుబిక్కుమంటూ అక్కడే కాలం గడిపారు. పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరూ స్పందించలేదు. అన్ని గంటల పాటు కనీసం తమకు తాగునీరు కూడా అందించలేదని బాధితులు వాపోయారు. వారిని శ్మశాన వాటిక షెడ్డులో ఉంచడం పట్ల మహిళల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. చికిత్స చేయకుండానే తమ వారిని చంపేస్తారా అని ప్రశ్నించారు. అనంతరం రాత్రి 8 గంటలకు బస్సులో వారిని తాడేపల్లిగూడెం తరలించారు.