కొవిడ్ రెండో దశలో.. కరోనా నివారణ మందు పేరిట పంపిణీ చేసి గుర్తింపు పొందిన ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. త్వరలో పార్టీ వివరాలు వెల్లడిస్తానన్నారు. యాదవ సంఘం జాతీయ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ పెట్టనున్నట్లు తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కరోనా నివారణ మందు తయారీకి ఏపీ ప్రభుత్వం సహకరించలేదని ఆనందయ్య ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం అఖిల భారతీయ యాదవ మహాసభ 13 జిల్లాల సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనందయ్య మాట్లాడుతూ ఆయుర్వేద మందు పంపిణీ విషయంలో విద్యుత్తు సరఫరాకు అనుమతులు ఇవ్వమని కోరినా ఎన్‌వోసీ రాలేదన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 13 జిల్లాల్లో రథయాత్ర నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.