కరోనా సోకి దిక్కుతోచక నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితులను ప్రైవేటు ఆస్పత్రులు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయి. కొన్ని పీల్చిపిప్పి చేస్తున్నాయి. ఓ మాదిరి సౌకర్యాలున్న దవాఖానాలో రోజుకు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. మందుల ఖర్చు దీనికి అదనం... నామమాత్రపు సౌకర్యాలతో ఉన్న ఓ చిన్న ఆస్పత్రి వసూలు చేసేది రోజుకు రూ.40-రూ.50 వేలు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఇది అయిదు నుంచి పది రెట్లు ఎక్కువ. ఇలా అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని 64 ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కొన్నింటిపై ఎక్కువ సంఖ్యలోనే ఫిర్యాదులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఆస్పత్రుల్లో అత్యధికం హైదరాబాద్‌లోవే.
వరంగల్, హన్మకొండ, నిజామాబాద్, సంగారెడ్డిలోని కొన్ని ప్రధాన దవాఖానాలూ ఉన్నాయి. కూకట్‌పల్లి ప్రధాన రోడ్డుపై ఉన్న ఓ ప్రముఖ ఆస్పత్రిపై ఆరు ఫిర్యాదులొస్తే, బేగంపేటలో మెయిన్‌రోడ్డులోని మరో కార్పొరేట్ ఆస్పత్రిపై అయిదు ఫిర్యాదులొచ్చాయి. కాచిగూడ, అబిడ్స్‌లోని రెండింటిపై మూడేసి, మరో 11 ఆస్పత్రులపై రెండేసి, 49 దవాఖానాలపై ఒక్కో ఫిర్యాదు వచ్చాయి. ఇందులో నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులూ ఉన్నాయి. వైద్యుడు రోజూ అయిదారుసార్లు వెళ్లి పరిశీలించినట్లు, అన్ని సార్లు పీపీఈ కిట్లు వాడినట్లు, రోగి సామాజిక దూరం పాటించేలా చూసినందుకు రూ.2,500, తడి వ్యర్థాలు పారేసినందుకు రూ.2,500 ఇలా రకరకాల బిల్లులు వేశారు. బీమా కంపెనీలు సైతం ఇలాంటి బిల్లులను తిరస్కరించాయి. దీంతో బీమా ఉన్న రోగులూ అదనంగా రూ. వేల చెల్లించాల్సి వచ్చింది.