కొండల్నిసైతం కరిగించే శక్తి యువత సొంతం. అందుకేనేమో... తొలి దశ కరోనా ప్రభావం వీరిపై అంతగా పడలేదు. కానీ, సెకండ్ వేవ్ అందుకు భిన్నం. వైరస్ నన్ను ఏం చేయదులే..! అనే ధోరణిలో ఉన్న యువతపైనే పంజా విసురుతోంది. ఫలితంగా వారి కుటుంబీకులు, సన్నిహితులు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రస్తుతం.. దాదాపు 60-70% వృద్ధులకు ఇంట్లోని యువత వల్లే కరోనా సోకుతుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తంతు. లాక్‌డౌన్ సడలింపులు తరువాత యువత కొవిడ్ నిబంధనలు పెడచెవిన పెట్టడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
యువత సంఖ్య క్రమంగా..
రెండో దశ ఉద్ధృతిలో వైరస్ బాధితుల్లో చిన్నారులు, యువత సంఖ్య పెరుగుతోంది. ఇటీవల తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం...ఏప్రిల్‌లో నమోదైన పాజిటివ్ కేసుల్లో 56.4 శాతం మంది 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఇప్పటి వరకు 43.2 శాతం కేసులు 21-40 ఏళ్ల యువతలోనే నిర్ధరణ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా బారినపడుతున్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తొలి దశలో ఆస్పత్రుల్లో చికిత్స పొందిన యువత శాతం తక్కువగా ఉన్నప్పటికీ...ఇప్పుడు గణనీయంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం... వైరస్ మ్యుటేషన్లు చెందడం వల్ల... లక్షణాలు వెంటనే కనిపించట్లేదు. ఫలితంగా... వైరస్ సోకినప్పటికీ స్వల్ప లక్షణాలే ఉండటం వల్ల యువత ఆసుపత్రిలో చేరడానికి ఆసక్తి కనబర్చట్లేదు. తద్వారా... పరిస్థితి విషమించే వరకు తీవ్రత అర్థం చేసుకోలేకపోతున్నారు. దీంతో నేరుగా ఐసీయూలో చేరాల్సిన దుస్థితి నెలకొందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
యువత ఎక్కువ సంఖ్యలో
సెకండ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. జనవరి నుంచి మార్చి వరకు నమోదైన కేసుల్లో 48% మంది 40 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. కర్ణాటకలో మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 వరకు నమోదైన కేసుల్లో 47% మంది 15 నుంచి 45 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. దిల్లీలో నమోదవుతున్న కేసుల్లో 65% మంది 45 సంవత్సాల లోపు వారేనని స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లోనూ యువత ఎక్కువ సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. అందులోనూ... డయాబెటిస్, ఊబకాయం, హైపోథైరాయిడ్‌తో బాధపడుతున్నవారే అధికం.
60% మంది
కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం... 2020 డిసెంబర్ వరకు నమోదైన కేసుల్లో... 60% మంది 45 సంవత్సరాల లోపు వారే. కానీ, ఎక్కువగా మరణాలు నమోదు కాలేదు. కరోనాతో మృతి చెందిన వారిలో... 55% మంది 60 సంవత్సరాలు పైబడిన వారే ఉన్నారు. అయితే, రెండో ఉద్ధృతితో ఎక్కువగా ఏ వయసుల వారు ప్రభావితం అవుతున్నారో అని అధికారికంగా వైద్యారోగ్యశాఖ ప్రకటించకపోయినప్పటికీ... గణాంకాలు మాత్రం యువతపైనే ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేస్తున్నాయి.