ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో కరోనా తాకిడికి ఉపాధ్యాయులు విలవిల్లాడుతున్నారు. మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో మహమ్మారి బారినపడ్డారు. ఎన్నికల విధులతోపాటు కరోనా రోగుల సమాచారం సేకరణ, నాడు-నేడు రెండో విడత పనులకు బ్యాంకు ఖాతాలు తెరవడం, జగనన్న విద్యాదీవెన కిట్ల పంపిణీ ఏర్పాట్లు వంటి కార్యక్రమాల వల్ల.. గురువులు బయటకు రాకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కరోనా కోరలకు చిక్కి విలవిల్లాడుతున్నారు.
చాలా మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్సలతో ఆర్థికంగా చితికిపోగా.. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 57 మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు ఏటీ అగ్రహారంలో ఫరుద్దీన్ అనే విశ్రాంత ఉపాధ్యాయుడి ఇంట్లో కరోనాతో మొత్తం ఐదుగురు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాగే చాలా ఇళ్లల్లో ఇద్దరు, ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.