తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా బాధితుల మృత్యుఘోష... ఒక్కరోజులోనే 29 మంది బలి

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లికి చెందిన ఒక విశ్రాంత ఉద్యోగి కుటుంబాన్ని కరోనా మింగేసింది. ఆయనతో పాటు భార్య, విదేశాల నుంచి ఇటీవల ఇక్కడికి వచ్చిన కుమారుడు(35) కూడా కొవిడ్‌కు బలయ్యారు. కుటుంబాలను కబళిస్తున్న మహమ్మారి ప్రతాపానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. వైరస్​ ప్రకోపానికి ఎందరో పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. కరోనా మహమ్మారి తీవ్రతకు రాష్ట్రంలో మృత్యుఘోషలు మారుమోగుతున్నాయి.

covid deaths increasing in Telangana
covid deaths increasing in Telangana

By

Published : Apr 24, 2021, 3:50 AM IST

రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది.ఒక్కరోజులోనే 29 మంది కరోనాతో కన్నుమూశారు. ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. గడచిన రెండ్రోజుల్లో 20, 23 మంది చొప్పున చనిపోగా గురువారం 29 మంది అసువులు బాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,928కి చేరింది. ఇప్పటివరకూ నమోదైన మొత్తం పాజిటివ్‌(3,79,494) కేసులతో పోల్చితే.. మరణాల శాతం(0.50) తక్కువగానే ఉన్నా.. కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత వారం రోజుల సరళిని పరిశీలిస్తే.. కొవిడ్‌ ఎంత ఉద్ధృతంగా ఉందో అర్థమవుతోంది. ఈనెల 13న ఎనిమిది మంది చనిపోగా, తర్వాత వరుసగా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 16న 12 మంది.. 19న 18 మంది.. 21న ఏకంగా 23 మంది కరోనాతో చనిపోయినట్లు వైద్యశాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. మృతుల్లో 30 శాతం మంది వరకూ 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారని వైద్యనిపుణులు పేర్కొనడం ఆందోళన రేకెత్తిస్తోంది.

రెండోదశలో వైరస్‌ ఎక్కువమందికి అతివేగంగా వ్యాప్తి చెందుతుందే గానీ.. దీనివల్ల మరణాలు అంత ఎక్కువగా ఉండవని తొలినాళ్లలో నిపుణులు భావించారు. ఇప్పుడు ఉద్ధృతంగా ఉన్న వైరస్‌ ఎవరి అంచనాలకు అందడం లేదు. అతివేగంగా వ్యాప్తి చెందడమే కాదు.. అత్యధికులను ప్రభావానికి గురిచేస్తోంది. వయసు మళ్లిన వారితోపాటు.. యుక్తవయస్కులపైనా విరుచుకుపడుతోంది. లక్షణాలు కనిపించగానే తమకేమీ కాదులే అనే భావనతో మూణ్నాలుగు రోజులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. ఈలోగా వైరస్‌ శరీరంలో దుష్ప్రభావాలు కలిగిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే లక్షణాలు కనిపించగానే వెంటనే పరీక్షలు చేయించుకోవడంతో పాటు.. వైద్యుని సలహా మేరకు అవసరమైన ఔషధాలను వాడడమూ అత్యంత కీలకాంశంగా పరిగణనలోకి తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మహమ్మారి ఉద్ధృతి మరో 4 వారాల పాటు ఉండే అవకాశాలున్నందున తప్పనిసరిగా ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు పాటించాలని, మాస్కు లేకుండా బయటకు రావొద్దని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, గుంపుల్లోకి వెళ్లకుండా నియంత్రించుకోవాలని చెబుతున్నారు.

52 వేలకు పెరిగిన క్రియాశీల కేసులు

రాష్ట్రంలో కొత్తగా 6,206 కొత్త కొవిడ్‌ కేసులు నమోదవ్వగా.. మొత్తం బాధితుల సంఖ్య 3,79,494కు పెరిగింది. వీరిలో 80.5 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. ఈనెల 22న(గురువారం) రాత్రి 8 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేశారు. తాజాగా మరో 3,052 మంది చికిత్స పొంది కోలుకోగా, ఇప్పటివరకూ 3,24,840 మంది ఆరోగ్యవంతులయ్యారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో కోలుకున్న వారి శాతం 85.59గా నమోదైంది. గత నెల తొలివారంలో కోలుకున్నవారి శాతం 98కి పైగా నమోదు కాగా.. తాజాగా సుమారు 13 శాతం తగ్గడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 52,726కు పెరిగింది. ఈనెల 1న కేవలం 6,159గా నమోదైన క్రియాశీల కేసులు.. మూడు వారాల వ్యవధిలో అమాంతం ఎనిమిదింతలకు పైగా పెరగడం గమనార్హం. ఈ కారణంగానే ఆసుపత్రుల్లో పడకలకు కటకట ఏర్పడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మున్ముందు కేసులు పెరిగితే పడకలు లభ్యమవడం కష్టమవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం 1,05,602 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 1,22,81,027కు పెరిగింది. మరో 5,531 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది.

25 జిల్లాల్లో విజృంభణ

జీహెచ్‌ఎంసీలో ఏకంగా 1,005 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి 502, నిజామాబాద్‌ 406, రంగారెడ్డి 373, మహబూబ్‌నగర్‌ 271, జగిత్యాల 257, మంచిర్యాల 226, సిద్దిపేట 215, కరీంనగర్‌ 197, నాగర్‌కర్నూల్‌ 196, కామారెడ్డి 188, సంగారెడ్డి 185, భద్రాద్రి కొత్తగూడెం 162, యాదాద్రి భువనగిరి 155, ఖమ్మం 152, వికారాబాద్‌ 151, రాజన్న సిరిసిల్ల 138, మెదక్‌ 136, ఆదిలాబాద్‌ 121, నల్గొండ 111, జనగామ 109, సూర్యాపేట 109, నిర్మల్‌ 107, వరంగల్‌ గ్రామీణ 103, మహబూబాబాద్‌లో 102 చొప్పున.. 25 జిల్లాల్లో భారీగా పాజిటివ్‌లు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 100 కంటే తక్కువ సంఖ్యలో కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఏపీలో 11,766 కేసులు, 38 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 11,766 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఎన్నడూ లేని విధంగా తొలిసారి శుక్రవారం 25.81% కేసులు నమోదయ్యాయి. 38 మంది ప్రాణాలు విడిచారు.

ఒక్కరోజులో 2.11 లక్షల డోసుల పంపిణీ

రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో టీకాల పంపిణీ జరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజులోనే 2 లక్షలకు పైగా టీకాలను వేశారు. గురువారం 1,86,457 మందికి తొలిడోసును, 24,787 మందికి రెండోడోసు సహా మొత్తంగా ఒక్కరోజే 2,11,244 డోసులను పంపిణీ చేశారు. ఇందులో 1,219 ప్రభుత్వ కేంద్రాల్లో 1,95,324 డోసులు కాగా.. 254 ప్రైవేటు కేంద్రాల్లో 15,920 డోసులను లబ్ధిదారులకు అందజేశారు. వీరిలో అత్యధికంగా 45 ఏళ్లు దాటిన వారు తొలిడోసును 1,81,561 మంది, రెండో డోసును 23,663 మంది స్వీకరించారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 36,02,734 డోసుల పంపిణీ పూర్తయినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకూ 1.06 శాతం టీకాలు వృథా అయినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: రాష్ట్రం నుంచి కుంభమేళాలో పాల్గొన్న వారికి హోంక్వారంటైన్‌

ABOUT THE AUTHOR

...view details