రాష్ట్రంలో ఇంటింటికి తిరిగి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే.. డెలివరీ బాయ్స్, సహాయక సిబ్బంది, డీలర్లు కరోనా బారిన పడుతున్నారు. లాక్‌డౌన్ వల్ల వినియోగం పెరిగి.. సిలిండర్ల సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దాదాపు కోటిన్నర గ్యాస్ కలెక్షన్లు ఉండగా రోజూ రెండులక్షల సిలిండర్ల డెలివరీ జరుగుతోంది. 500 మంది ఎల్పీజీ డీలర్లు, పదమూడున్నరవేల మంది సిబ్బంది.. మొత్తం 14వేల మంది భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే నాలుగు వేలకుపైగా సిబ్బంది, డెలివరీబాయ్స్, డీలర్లు కరోనా బారిన పడ్డారు. 9 మంది ఏల్పీజీ అధీకృత డీలర్లు, 44 మంది డెలివరీ బాయ్స్ మృత్యువాతపడ్డారు. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం నెట్‌వర్క్‌ను కలవరపెడుతోంది. తమను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించాలని లేదంటే సిలిండర్ల సరఫరా నిలుపుదల చేస్తామని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ హెచ్చరించింది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే..
పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామీణ ప్రాంతాలే కాకుండా.. పట్టణ, నగరాల్లోనూ గ్యాస్ సిలిండర్లును ఇంటింటికి సరఫరా చేయలేమని అసోసియేన్ స్పష్టంచేసింది. డెలివరీ బాయ్స్ నుంచి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చింది. ఇదే అంశంపై రెండు నెలలుగా పౌరసరఫరాల, ఆరోగ్యశాఖతో పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నా ఫలితం లేవని ఆవేదన వ్యక్తం చేసింది.. ఎల్పీజీ పరిధిలోకి వచ్చే వాళ్లందరినీ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి... కరోనా టీకాలు వేయాలని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, దిల్లీ, మహారాష్ట్ర, అసోం సహా కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో టీకాలు వేస్తున్నారని వివరించింది..