తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి - తెలంగాణలో కరోనా వైరస్‌ ఉద్ధృతి

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 209 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పలువురు అధికారులు సైతం వైరస్‌ బారిన పడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

అధికారులు ఉక్కిరిబిక్కిరి
అధికారులు ఉక్కిరిబిక్కిరి

By

Published : Jun 12, 2020, 5:52 AM IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా గురువారం యాదాద్రి సీఈవో దంపతులకూ కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత శనివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న సీఈవో సెలవు పెట్టి హైదరాబాద్‌ వనస్థలిపురంలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అతని భార్యకూ జ్వరం రావడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా ఫలితం వచ్చినట్లు యాదాద్రి కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ వివరించారు. ఈ నేపథ్యంలో తాను వారం పాటు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తానని కలెక్టర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఓ రైల్వే అధికారిణికి కూడా కరోనా సోకింది. సికింద్రాబాద్‌లోని హైదరాబాద్‌ రైల్వే డివిజన్‌ కార్యాలయమైన హైదరాబాద్‌ భవన్‌లో ఆమె సీనియర్‌ డివిజన్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

తాజా పరిస్థితుల క్రమంలో హైదరాబాద్‌ భవన్‌లో ఉద్యోగుల్ని 11 గంటలకల్లా ఇంటికి పంపించి వేశారు. ఇక్కడ దాదాపు 250 మంది ఉద్యోగులు ఉంటారు. సోమవారం తిరిగి ఆఫీసుకు రావాలని రైల్వే అధికారులు ఉద్యోగులకు స్పష్టం చేశారు. అధికారిణితో ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన 9 మంది రైల్వే అధికారులు, ఉద్యోగులను గుర్తించారు. వారిని హోంక్వారంటైన్‌లో ఉండాలని రైల్వేశాఖ ఆదేశించింది. హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో ఇది రెండో కరోనా కేసు. వారం క్రితం గూడ్సు రైలు గార్డు కరోనా బారినపడ్డారు. విజయవాడ డివిజన్‌లో సీనియర్‌ డివిజన్‌ సిగ్నల్‌ టెలికాం ఇంజినీర్‌కూ వైరస్‌ సోకింది. అలాగే ముందస్తు జాగ్రత్తలో భాగంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. కొండపోచమ్మ సాగర్‌ ముంపు గ్రామాలకు చెందిన పలువురు నిర్వాసితులు వర్గల్‌ మండలం గౌరారంలో సొంతంగా ప్లాట్లు కొనుగోలు చేశారు. వాటిలో ఇళ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు ఇప్పించే అంశంపై ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు ఇటీవల సిద్దిపేట కలెక్టరేట్‌లో ఆయన్ను కలిశారు. వారితో వచ్చిన వర్గల్‌ మండలం గౌరారం గ్రామానికి చెందిన వ్యక్తికి గురువారం పాజిటివ్‌ అని తేలింది. కలెక్టర్‌ ములుగు అతిథి గృహంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. డ్రైవరుకు కరోనా సోకడంతో హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కుటుంబం స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది.

అవగాహన ఉన్న వారిలోనూ వ్యాప్తి


ఇటీవలే రాష్ట్రానికి చెందిన మాజీ శాసనసభ్యుడికి, ఆయన కుటుంబ సభ్యులకూ కొవిడ్‌ సోకింది. కరోనాపై పూర్తి అవగాహన ఉన్న వైద్యుల్లోనూ వ్యాప్తి చెందింది. ఒక్క నిమ్స్‌లోనే దాదాపు 30 మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఇందులో సీనియర్‌ ఆచార్యులు కూడా ఉన్నారు. ఇంకా ఉస్మానియా, గాంధీ, పేట్లబురుజు, ఛాతీ ఆసుపత్రులు సహా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యనిపుణులూ చిక్కుకున్నారు. కొద్దిరోజుల కిందట శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లనూ వదల్లేదు. అన్నింటా ప్రజా చైతన్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులూ మహమ్మారి బారినపడ్డారు. ఇలా ఒక్కరని కాదు.. వేర్వేరు వృత్తులు, హోదాలు, స్థాయుల్లో ఉన్న పలువురు ప్రముఖులూ ఇటీవల మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా వెలుగులోకి వస్తున్న కేసులను పరిశీలిస్తే ఇదే తెలుస్తోంది.

సన్నిహితులే కదా అనుకుంటే పొరపాటే

కరోనా పట్ల గత మూణ్నెల్లుగా విస్తృత ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటికీ వైరస్‌ తీవ్రతను అంచనా వేయడంలో ఎక్కువమంది విఫలమవుతున్నారని వైద్యనిపుణులు చెబుతున్నారు. అవగాహన ఉన్నవారు కూడా తమ సన్నిహితులు, ఎక్కువగా పరిచయం ఉన్న అధికారులు, సహచరుల సమక్షంలో కనీస జాగ్రత్తలేమీ తీసుకోకుండానే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘బాగా సన్నిహితులే కదా.. వారిలో వైరస్‌ ఉండదులే’ అనే భావనతో మాస్కుల్లేకుండా మాట్లాడుకుంటున్నారు. కొందరు రాజకీయ నేతలు మీడియా సమావేశాల్లో మాస్కులు కిందకు జారవిడిచి మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే వ్యక్తిగత దూరం కూడా పాటించకుండా.. పక్కపక్కన కూర్చొని సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల సమావేశాల్లోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తోంది. ఫలితంగా వైరస్‌ వ్యాప్తి చెందడానికి అవకాశాలు పదింతలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు వైరస్‌ తీవ్రత పెచ్చరిల్లే ప్రమాదం ఉన్నందున.. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం సామాజిక బాధ్యతగా భావించాలని చెబుతున్నారు.

  • మాస్కు ఎలా వినియోగించాలో తెలుసుకోవడం ముఖ్యం. అస్తమానం చేత్తో మాస్కు ముందు భాగాన్ని తాకడం వల్ల వైరస్‌ చేతులకు అంటుకునే ప్రమాదముందంటున్నారు.
  • మాస్కు వల్ల అసౌకర్యంగా అనిపిస్తే.. చెవి భాగంలో పక్కల నుంచి సర్దుకోవాలే తప్ప.. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు భాగాన్ని ముట్టుకోవద్దని సూచిస్తున్నారు.

నేడు మేయర్‌కు కరోనా పరీక్ష

హైదరాబాద్‌ మహానగపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయాన్నీ కరోనా వణికిస్తోంది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కార్యాలయంలో పనిచేసే అటెండర్‌కు బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా గురువారం ఆయన కారు డ్రైవర్‌ ఒకరు వైరస్‌ బారినపడ్డారు. మేయర్‌కు శుక్రవారం కొవిడ్‌ పరీక్ష చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంలో పక్షం రోజుల క్రితం నగరంలోని రోడ్డు పక్కనే ఉండే ఓ హోటల్‌లో అధికారులతో కలిసి మేయర్‌ టీ తాగారు. ఆ హోటల్‌లో పనిచేసిన వ్యక్తికి కరోనా వచ్చిందని తేలడంతో వారం క్రితం మేయర్‌ సైతం పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. ఊపిరి పీల్చుకున్న ఆయన ప్రతి రోజూ నగరంలో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో తన కార్యాలయంలో అటెండర్‌ ఒకరికి పాజిటివ్‌ తేలడంతో అదేచోట పని చేసే 8 మందికి తాజాగా పరీక్షలు చేయగా డ్రైవర్‌కు నిర్ధారణ అయింది. గురువారం ఉదయం వరకు అతడు విధులు నిర్వహించాడు. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిన విషయం వాస్తవమేనని రామ్మోహన్‌ ‘ఈటీవీ భారత్​’కు తెలిపారు. తన కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయించగా అందరికీ నెగెటివ్‌ వచ్చిందన్నారు. తాను శుక్రవారం చేయించుకుంటానని తెలిపారు. కుటుంబమంతా స్వీయ నిర్బంధంలో ఉన్నామన్నారు. ఇప్పటికే మేయర్‌ కార్యాలయాన్ని మూసివేశారు.

ఇవీ చూడండి:ఎస్సీ, ఎస్టీలు ఎదిగితే కేసీఆర్​ సహించరు: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details