రాష్ట్రంలోని పాఠశాలలపై కరోనా పంజా విసురుతోంది. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కొవిడ్ బారిన పడుతున్నారు. వివిధ జిల్లాల్లోని విద్యాలయాల్లో మూడు రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ఖమ్మం జిల్లా పెద్దమండవలో..
తాజాగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ పాఠశాలలోని 10 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. విద్యార్థులను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
నాగర్కర్నూల్లో
నాగర్ కర్నూలులోని ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులకు మహమ్మారి సోకింది. ఇదే గురుకుల పాఠశాలలో నిన్న నలుగురికి వైరస్ వచ్చింది. మొత్తం ఇప్పటివరకు 16 మంది విద్యార్థులకు కరోనా బారిన పడ్డారు. అధికారులు స్పందించి శానిటేషన్ చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించారు. 16 మంది విద్యార్థులను ఏరియా ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్లో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.