లాక్‌డౌన్ సడలింపుల అనంతరం రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో మార్చి 2న తొలి కేసు నమోదైన తర్వాత.. ఈ నెలలోనే పెద్దఎత్తున బయటపడుతున్నాయి. సగటున రోజుకు వందకు పైగానే నిర్ధారణ అవుతున్నాయి. ఈనెల 1 నుంచి 9 ఉదయం వరకూ నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం 1140 మంది కరోనా బాధితులను నిర్ధారించగా, వీరిలో నడివయసు లోపు వారు అధికం. 50 ఏళ్ల లోపు వారు 773 (67.81 శాతం) మంది కొవిడ్ బారినపడ్డారు. 21-50 ఏళ్ల మధ్య వయస్కులు 712 (62.46 శాతం) మంది. కరోనా మృతుల్లో 41-60 మధ్య వయస్కుల శాతం 66.65 కావడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగ, వ్యాపార, ఉపాధి అవసరాల కోసం బయటకు రాకపోకలు సాగించడం వల్ల వైరస్ వ్యాప్తి కూడా సులభంగా, వేగంగా ఒకరి నుంచి మరొకరికి జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వారికి దూరంగా ఉండడమే మేలు
పదేళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో కరోనా సోకడానికి ప్రధానంగా వారి కుటుంబ సభ్యులే కారణంగా నిలుస్తారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ వయసు వారు ఇళ్ల నుంచి బయటకు రాకపోయినా.. వెలుపలకు వెళ్లి వచ్చినవారు కుటుంబ సభ్యులకు వైరస్ సోకడానికి కారకులుగా నిలుస్తున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని.. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, వ్యక్తిగత దూరాన్ని పాటించడం, తరచూ చేతులు శుభ్రపర్చుకోవడం వంటివి పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు.. బయటకు వెళ్లొచ్చినవారు వారికి దూరంగా ఉండడమే మేలని సూచిస్తున్నారు.
ఇతరత్రా కారణాలూ అధికమే
ఈనెలలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణాలను పరిశీలిస్తే.. వైద్యఆరోగ్యశాఖ పొందుపర్చిన సమాచారంలో ‘ఇతరత్రా’ కారణాలే అధికంగా ఉన్నాయి. ఈనెలలో నమోదైన మొత్తం బాధితుల్లో ఇలా ఇతరత్రా కారణాలతో వైరస్ సోకినవారు 291(25.53శాతం) మంది ఉన్నారు. కరోనా చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిలోనూ 110(9.65శాతం) మంది వైరస్ బారినపడ్డారు. మొత్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే.. మహిళల్లో కంటే పురుషుల్లో వైరస్ ఎక్కువ మందిలో వ్యాప్తి ఉంది.
మృతుల గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
ఈ నెల తొలి 7 రోజుల్లో మరణాలు 45 కాగా ఇందులో 41-50 ఏళ్ల మధ్యవయస్కులు 17 మంది(37.77శాతం). వీరిలో అధికులు తీవ్ర శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వైఫల్యంతో మృతిచెందినట్లుగా వైద్య నివేదికలు చెబుతున్నాయి. 50 ఏళ్లు పైబడినవారు 25 మంది(55.55శాతం) మృతిచెందారు. వీరిలో అధికులు రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బు, మూత్రపిండాల వైఫల్యం, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు.. తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు. ఈ అనారోగ్య సమస్యలకు కరోనా వైరస్ కూడా జత కలవడంతో కోలుకోవడం కష్టమైందని వైద్య వర్గాలు వివరిస్తున్నాయి. లక్షణాలు కనిపించిన తర్వాత ఆలస్యంగా ఆసుపత్రికి రావడం వల్ల కూడా వ్యాధి ముదిరి చికిత్సకు స్పందించలేదని పేర్కొంటున్నాయి.
3 నెలల బాబుకు కరోనా
సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కోడేకల్ గ్రామంలోని మూడు నెలల బాబు కరోనా బారినపడ్డాడు. అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఈ నెల 7న హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించారు. 8న నమూనాలను పరీక్షలకు పంపించగా.. కరోనా సోకినట్లు తేలింది. ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య 69కి చేరింది.