Covaxin Booster Dose : కొవాగ్జిన్ టీకాకు మరొక అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ టీకాను ప్రయాణికులు బూస్టర్ డోసుగా తీసుకోవడానికి జపాన్ అనుమతించిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఫైజర్, మొడెర్నా, నొవావ్యాక్స్, ఆస్ట్రజెనెకా, జాన్సన్ కంపెనీలకు చెందిన కొవిడ్ టీకాలకు కొంతకాలంగా జపాన్‌లో ఇటువంటి అనుమతి ఉంది. తాజాగా ఈ జాబితాలో భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ను చేర్చింది. బూస్టర్ డోసుగా కొవాగ్జిన్ టీకాను తీసుకున్న ప్రయాణికులను జులై 31 నుంచి అనుమతిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వ ఆరోగ్య,కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తద్వారా భారత్ బయోటెక్ పలు బహుళజాతి ఫార్మా కంపెనీల సరసన చేరినట్లవుతోంది.
Covaxin Booster Dose in Japan : ‘కొవాగ్జిన్’ టీకా బూస్టర్ డోసుతో రోగ నిరోధక శక్తి పెరుగుతోందని ఇటీవలే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఈ విషయాన్ని ‘నేచర్’ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించినట్లు పేర్కొంది. 'కొవాగ్జిన్ టీకా బూస్టర్ డోసు ప్రయోగాలను 184 మంది వాలంటీర్లపై నిర్వహించారు. రెండు డోసుల టీకా తీసుకున్న ఆరు నెలల తర్వాత వారికి బూస్టర్ డోసు ఇచ్చారు. ఇందులో సగం మందికి నిజమైన టీకా, మిగిలిన వారికి ‘ప్లాసిబో’ ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. బైండింగ్ యాంటీబాడీస్ ఉత్పత్తి, ఆర్‌బీడీ, ఎన్-ప్రొటీన్, మెమొరీ టీ-సెల్, బీ-సెల్ రెస్పాన్స్.. తదితర అంశాలను పరిశీలించామని.' భారత్ బయోటెక్ తెలిపింది.