తెలంగాణ

telangana

ETV Bharat / city

సేవల్లో లోపముందని.. అమెజాన్‌కు జరిమానా - amazon bad service

Fine on Amazon: వినియోగదారునికి మెరుగైన సేవలే లక్ష్యంగా అన్ని కంపెనీలు పనిచేస్తుంటాయి. అందులోనూ డిజిటల్​ సంస్థలైతే.. వినియోగదారుడి నుంచి మరింత మెప్పు పొందేందుకు మన్నికైన సేవలు అందిస్తూ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఒకవేళ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలిగించినా.. పెద్ద మొత్తంలోనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దానికి నిదర్శనమే ఈ ఘటనలు.. అవేంటో మీరే చూడండి:

coustomer commistioner fine on amazon company for bad service
coustomer commistioner fine on amazon company for bad service

By

Published : Jun 24, 2022, 9:29 AM IST

Fine on Amazon: కొనుగోలు చేసిన వస్తువును డెలివరీ చేయకపోగా.. వసూలు చేసినదాని కన్నా తక్కువ డబ్బు వాపసు చేసి ఇబ్బంది పెట్టినందుకు రూ.10వేలు చెల్లించాలని అమెజాన్‌ సంస్థను హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 ఆదేశించింది. గాంధీనగర్‌ బ్యాంక్‌ బరోడా కాలనీకి చెందిన ఎం.శ్రీకాంత్‌.. అమెజాన్‌ నుంచి ఓ చరవాణిని రూ.43,852 వెచ్చించి 2020 జనవరిలో కొనుగోలు చేశారు. చరవాణిని కొనుగోలుదారుడికి చేరవేయలేదు. దీంతో అతనికి కేవలం రూ.41,742 మాత్రమే సంస్థ వాపసు చేసింది. డబ్బులు తగ్గించడంపై సంస్థ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌ను శ్రీకాంత్‌ ఆశ్రయించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కమిషన్‌-2 బెంచ్‌.. సేవల్లో లోపంగా పరిగణిస్తూ పరిహారంగా రూ.5వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు, 45 రోజుల్లో చెల్లించాలని అమెజాన్‌ సంస్థను ఆదేశించింది.

కొత్త బైక్‌ ఇవ్వాలని ఆది మోటార్స్‌కు ఆదేశం..:ఉత్పత్తి లోపం ఉన్న ద్విచక్రవాహనం అందించి సేవల్లో లోపం కలిగించినందుకు కొత్త బైక్‌ ఇవ్వాలంటూ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 ప్రతివాద సంస్థలను ఆదేశించింది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సీహెచ్‌.రవింద్రబాబు అనే న్యాయవాది కమిషన్‌ను ఆశ్రయించగా.. విచారించిన బెంచ్‌ 45 రోజుల్లో తీర్పు అమలు చేయాలని తీర్పు వెలువరించింది. 2017లో కొనుగోలు చేసిన హోండా సీబీ షైన్‌ వాహనం తరచూ మరమ్మతులకు గురవ్వడం, సమస్యను గుర్తించడంలో ప్రతివాద సంస్థలు హోం మోటర్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌, మలక్‌పేట్‌లోని ఆది మోటార్స్‌ విఫలమయ్యాయంటూ ఫిర్యాదీ.. కమిషన్‌కు తెలిపారు. సాక్ష్యాధారాలు పరిశీలించి బెంచ్‌ తీర్పు వెలువరించింది.

వాహన బీమా చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ముషీరాబాద్‌కు చెందిన సీహెచ్‌.గోపీనాథ్‌ అనే వ్యక్తి వాహన బీమా సంస్థ (భారతీ అడా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌)పై ఫిర్యాదు చేయగా.. విచారించిన హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-3, వాహన బీమా పరిహారం రూ.5,34,370లో 75శాతం చెల్లించాలని, పరిహారం రూ.20వేలు, కేసు ఖర్చులు రూ.10వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది.

సికింద్రాబాద్‌లోని లా బెల్లె బాడీ కేర్‌ ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థ ప్రకటనలకు ఆకర్షితురాలైన అమీర్‌పేట్‌కు చెందిన ఎం.శారద తనతో పాటు తన కూతుళ్ల కోసం ‘ఫుల్‌ బాడీ హెయిర్‌ రిమూవల్‌ ట్రీట్‌మెంట్‌’ కావాలంటూ ఆశ్రయించారు. ఈ మేరకు రూ.1,18,000 ప్యాకేజీతో చికిత్స అందించేందుకు ప్రతివాద సంస్థ అంగీకరించింది. చికిత్స ప్రారంభించిన కొంతకాలం తర్వాత దఫదఫాలుగా మరో రూ.20వేలు వసూలు చేశారు. ఇలా మూడేళ్లు గడిచిపోయాయి. ఏ మాత్రం ఫలితం కనిపించకపోవడంతో బాధితురాలు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 బాధితురాలికి రూ.1,15,500 (9శాతం వడ్డీతో), పరిహారం రూ.25వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details