జేఎన్‌టీయూహెచ్ కూకట్‌పల్లి ప్రాంగణం 80 ఎకరాల్లోనే ఉండటంతో స్థల సమస్య ఎదురవుతోంది. కొత్తగా వచ్చే కోర్సులను వర్సిటీకి ఉన్న సుల్తాన్‌పూర్, జగిత్యాల, మంథని ప్రాంగణాల్లోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం సంగారెడ్డి సమీపంలోని సుల్తాన్‌పూర్ కళాశాలకు తరలించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించిన బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుని కూడా మంథని ప్రాంగణంలోనే ప్రారంభించారు.
జేఎన్‌టీయూహెచ్ విస్తరణ కష్టమే.. కొత్త కోర్సులు ఇతర ప్రాంగణాలకే! - JNTUH is located in 80 acres
జేఎన్‌టీయూహెచ్ కూకట్‌పల్లి ప్రాంగణంలో కొత్త కోర్సులు రావా? అంటే అవుననే అంటున్నాయి విశ్వవిద్యాలయ వర్గాలు. వర్సిటీ కేవలం 80 ఎకరాల్లోనే ఉండటంతో ఇప్పటికే స్థల సమస్య ఎదురవుతోంది. మౌలిక వసతుల సమస్యకు తోడు నియామకాలు లేకపోవడంతో ఈ ప్రాంగణంలో బీటెక్ స్థాయిలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు వర్సిటీ వర్గాలు ఆసక్తి చూపడం లేదు. ఇకపై కొత్తగా వచ్చే కోర్సులను వర్సిటీకి ఉన్న సుల్తాన్‌పూర్, జగిత్యాల, మంథని ప్రాంగణాల్లోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జేఎన్‌టీయూహెచ్‌లో 2008లో ఇంటిగ్రేటెడ్ కోర్సు (ఐదేళ్లలో బీటెక్‌తో పాటు ఎంటెక్ లేక ఎంబీఏ చేసే అవకాశం)లు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బీటెక్ స్థాయిలో 2014-15లో కెమికల్ ఇంజినీరింగ్ కోర్సును ప్రారంభించారు. దానికి సరైన ప్రయోగశాలలు నిర్మించడానికి కూడా ఇక్కడ తగినంత స్థలం లేదు. ఈ విభాగంలో ఇప్పటివరకు ఒక్క శాశ్వత ఆచార్యుడు కూడా లేరని సమాచారం. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ కోర్సుని సుల్తాన్‌పూర్ కళాశాలలో నిర్వహించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు.
జేఎన్‌టీయూహెచ్‌లో ఎంఫార్మసీ కోర్సు ఉన్నా బీఫార్మసీ లేదు. దీంతో బీఫార్మసీ కోర్సును కూడా వచ్చే ఏడాది సుల్తాన్‌పూర్ ప్రాంగణంలోనే ప్రారంభించనున్నారు. ఈ ప్రాంగణం హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో పాటు 200 ఎకరాల స్థలం, చుట్టూ అనేక పరిశ్రమలు ఉన్నందున భవిష్యత్తులో దాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ‘‘వర్సిటీ అంటే కనీసం 200 ఎకరాలకుపైగా స్థలం ఉండాలి. జేఎన్‌టీయూహెచ్‌కు 80 ఎకరాలే ఉంది. గతంలో పలు భవనాలు జీ ఫ్లస్ 2 లేదా 3 నిర్మించారు. వాటిపై అంతస్తులు పెంచాలన్నా కష్టమే. సమీపంలో మరో ప్రాంగణం వెతకాలి. ఇప్పుడున్న ప్రాంగణంలో మౌలిక వసతులు పెంచడంతోపాటు నియామకాలు జరపడం ముఖ్యం’’ అని జేఎన్‌టీయూహెచ్ మాజీ ఉపకులపతి ఆచార్య డీఎన్‌రెడ్డి అన్నారు.