తెలంగాణ

telangana

ETV Bharat / city

Re Marriage : పెళ్లి చేసుకున్నారు.. విడిపోయారు.. మళ్లీ ఒక్కటయ్యారు - couple united after taking divorce

వేదమంత్రాలు, మంగళవాద్యాలు, బంధుగణం మధ్య అట్టహాసంగా ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్నేళ్లకు మనస్పర్థలతో విడిపోయారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డాక వీరు ఒంటరిగా మిగిలిపోయారు. ఆ ఒంటరితనాన్ని భరించలేక మళ్లీ ఒక్కటవ్వాలనుకున్నారు. ఎక్కడైతే విడిపోయారో అక్కడే కలవాలని నిర్ణయించుకుని కోర్టుని ఆశ్రయించారు.

Re Marriage after divorce
ఒంటరితనానికి విడాకులు

By

Published : Jul 11, 2021, 7:37 AM IST

జీవితాంతం ఒకరికొకరు తోడుండాలనుకున్నారు. అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. ఒకరంటే మరొకరికి ప్రాణంగా బతికారు. ప్రేమ ఉంటే చాలు బతకడానికి ఇంకేం అక్కర్లేదని సంబురపడిపోయారు. ప్రేమంటే ఇదేనేమో అనేలా అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారి ప్రేమకు ప్రతిరూపాలుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలే లోకంగా బతికారు. వారి ప్రతి కదలిక వీళ్లకి అద్భుతంగా కనిపించేది.

హైదరాబాద్​కు చెందిన ఆ జంట.. 15 ఏళ్లు ఎలా గడిచాయో కూడా తెలియకుండా.. తమదైన లోకంలో బతికింది. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో.. తలెత్తిన మనస్పర్థలు చినికిచినికి గాలివానగా మారాయి. రోజూ గొడవపడే బదులు విడిపోవడమే నయమనుకునేలా చేశాయి. ఇక ఎవరి బతుకు వారు బతుకుదామనే నిర్ణయానికి వచ్చేశారు. వేదమంత్రాలు, మంగళవాద్యాలు, అశేషబంధుజనం మధ్య అంగరంగవైభవంగా.. ఒక్కటైన దంపతులు.. తమ 15 ఏళ్ల బంధానికి న్యాయస్థానంలో విడాకులు తీసుకుని ముగింపు పలికారు. మరో 15 ఏళ్లు విడివిడగా బతికారు.

పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. వీరు మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. చుట్టూ ఎంత మంది ఉన్నా.. నా అనే మనిషి లేకపోవడం బాధాకరం. వృద్ధాప్యంలో తమకంటూ ఓ తోడు లేకపోవడం వారిని కుంగదీసింది. ఓ వైపు వయోభారం.. మరోవైపు వేధిస్తున్న ఒంటరితనం వారి పాలిట నరకంగా మారాయి. ఆ నరకాన్ని భరించలేక తోడు కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఎవరో కొత్త వాళ్లని తమ జీవితంలోకి ఆహ్వానించే బదులు.. 15 ఏళ్లు కలిసి కష్టసుఖాలు పంచుకున్న తామే మళ్లీ ఒక్కటైతే బాగుంటుందని అనుకున్నారు. ఏ కోర్టులో విడాకులు తీసుకున్నారో.. అక్కడే తిరిగి ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్నదే తడవుగా కోర్టును ఆశ్రయించారు. వారి సమస్యను న్యాయస్థానం.. లోక్‌అదాలత్‌కు పంపింది. హిందూ వివాహ చట్టం, సెక్షన్‌ 15 ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి లోక్‌అదాలత్‌ బెంచ్‌ శనివారం అనుమతినిచ్చింది. వచ్చే వారం వారిద్దరూ మళ్లీ ఒక్కటి కానున్నారు.

ABOUT THE AUTHOR

...view details