Country Chicken in Hyderabad : ఆలోచనలు కొత్తగా ఉంటే.. వ్యాపార రంగం అంతే కొత్తగా ప్రతిబింబిస్తుందనడానికి నిదర్శనం ఈ కుర్రాళ్లు. హైదరాబాద్లోని కూకుట్పల్లి ప్రగతినగర్లో నాటుకోళ్ల మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇందులో కొత్తేమీ ఉందనేగా మీ సందేహం. చాలా చోట్ల నాటుకోళ్ల మాంసాన్ని విక్రయిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా వీరు ఎంచుకున్న విధానం.. నాటుకోడి తినాలనుకునే చికెన్ ప్రియులను ప్రగతినగర్ వైపు పరుగులు పెట్టిస్తోంది.
పాప్కార్న్ వ్యాపారం కుదేలు..
Country Chicken Outlet : ఐఐటీ వారణాసిలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన సాయికేష్.. వ్యాపారవేత్తగా స్థిర పడాలి అనుకున్నాడు. ఇందుకోసం తొలుత సినిమా థియేటర్లకు పాప్కార్న్ విక్రయించే కార్న్ క్వెస్ట్ ప్రైవేట్ లిమిడెట్ అనే స్టార్టప్ ప్రారంభించాడు. వ్యాపారం బాగా పుంజుకుంటుదనేలోగా.. కరోనా ప్రభావంతో సినిమాహాల్స్ మూతపడ్డాయి. ఫలితంగా.. పాప్కార్న్ వ్యాపారం కుదేలైంది.
తొలుత ఆన్లైన్లో..
Country Chicken Outlet in Hyderabad : కరోనా సమయంలో చికెన్ విక్రయాలు ఊపందుకోవడం గమనించాడు. నగరవాసులకు ఆరోగ్యవంతమైన నాటుకోడి మాంసం విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడు సమీఉద్దీన్తో కలిసి నాటుకోళ్ల పెంపకం, విక్రయాలు, లాభనష్టాలపై ఆరాతీశాడు. తెలిసిన రైతు హేమాంబర్ రెడ్డి ద్వారా నాటుకోళ్లు పెంచడం మొదలుపెట్టారు. తొలుత ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ద్వారా కంట్రీ చికెన్ కో పేరుతో విక్రయాలు మొదలుపెట్టారు. వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది.
ప్రగతినగర్లో ఆఫ్లైన్ ఔట్లెట్..
Country Chicken Outlet at Kukatpally : క్లాసిక్ ఆంధ్ర, మైసూర్ క్వీన్, భీమవరం పందెం కోళ్లు, టెండర్ తెలంగాణ, కడక్ నాథ్ వంటి వివిధ రకాలైన నాటుకోడి మాంసం విక్రయానికి కూకట్ పల్లి ప్రగతినగర్ లో ప్రత్యేకంగా ఫామ్ ఔట్ లెట్ తెరిచారు.