Council Chairman Guttasukhender Reddy press meet: కొంత మంది విలీనం, విమోచనం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడుకుంటున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలిసి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శాసనమండలి ఛైర్మన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ పట్టణంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని గుత్తా సుఖేందర్ అన్నారు.
ఆనాడు పోరాటంలో అసువులు బారిన వారికి ఆయన జోహార్లు తెలిపారు. బాధ్యత లేకుండా కొంత మంది విలీనం, విమోచనం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమైన చర్యగా భావించారు. తెలంగాణ ఉద్యమం అంటే ఏంటో తెలియని వారు కూడా ఏదేదో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర గవర్నర్ సైతం విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం విడ్డూరం అని అన్నారు.