ఈసారి పత్తి దిగుబడి నిరాశాజనకంగా ఉంది. తెగుళ్లు, వర్షాలతో పంట పాడవటంతో మార్కెట్లకు పెద్దగా రావడం లేదు. పత్తి కొనుగోళ్లు ప్రారంభించి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ 4.89 లక్షల టన్నులే కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది. వ్యాపారులు ధరలు బాగా తగ్గించడంతో రైతులు ‘భారత పత్తి సంస్థ’(సీసీఐ) కొనుగోలు కేంద్రాలకే ఎక్కువగా తెస్తున్నారు. ఇప్పటివరకూ సీసీఐ 3.64 లక్షల టన్నులు, వ్యాపారులు 1.25 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. కనీసం ఒక్కశాతం పంటకైనా పూర్తిస్థాయి మద్దతు ధర క్వింటాకు రూ.5825 ఇవ్వలేదు.
మార్కెట్లకు వచ్చింది 4.89 లక్షల టన్నులే..!
తెగుళ్లు.. వర్షాలతో ఈ ఏడాది పత్తి దిగుబడి నిరాశాజనకంగా ఉంది. కొనుగోళ్లు ప్రారంభించి రెండు నెలలవుతున్నా.. ఇప్పటివరకూ 4.89 లక్షల టన్నులే కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది.
రాష్ట్రంలో బుధవారం క్వింటాకు కనిష్ఠంగా రూ.3600, గరిష్ఠంగా రూ.5500 మాత్రమే చెల్లించారు. దూది నాణ్యతగా లేదని సీసీఐ కూడా పూర్తి ధర ఇవ్వడం లేదు. దీనికితోడు దూదిపింజ పొడవు తక్కువగా ఉంటోందని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5825కన్నా తొలిసారి ఈ ఏడాది రూ.100 వరకూ తగ్గిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో 60.15 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయగా 38 లక్షల టన్నుల పంట మార్కెట్లకు వస్తుందని మార్కెటింగ్ శాఖ తొలుత అంచనా వేసింది.
కానీ ఇందులో ఇప్పటికి 12.86 శాతమే వచ్చింది. ఎకరానికి చాలా ప్రాంతాల్లో నాలుగైదు క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదని మార్కెటింగ్ శాఖ అధికారి ఒకరు చెప్పారు. వర్షాలు, తెగుళ్లతో పత్తి దిగుబడి అంచనాలు తారుమారయ్యాయని వివరించారు. మొత్తం దిగుబడి 30 లక్షల టన్నులు దాటడం కష్టంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పత్తి పంట ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలతో పోలిస్తే ఇప్పటికే గరిష్ఠ ధర రూ.వెయ్యి అదనంగా పెరిగి ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రూ.5500 దాకా చెల్లిస్తున్నారు. కొందరు రైతులు ధర పెరుగుతుందేమోనన్న ఆశతో పంటను ఇళ్లలో నిల్వ చేయడం కూడా మార్కెట్లకు పత్తి పెద్దగా రాకపోవడానికి కారణమని తెలుస్తోంది.
- ఇదీ చూడండి :తీవ్ర తుపానుగా మారిన నివర్