తెలంగాణ

telangana

ETV Bharat / city

దూది పింజ పొడుగు తగ్గగా.. రైతులకు రూ.200 కోట్లు నష్టం - loss to cotton business due to rains in telangana

తెలంగాణలో కురిసిన భారీ అకాల వర్షాలు.. చాలా ప్రాంతాల్లో తీరని నష్టాన్ని మిగిల్చింది. వానల వల్ల పత్తి పంట నాణ్యతతో పాటు దూది పింజ పొడుగు తగ్గడం వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోనున్నారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 4 కోట్ల క్వింటాళ్ల పత్తి మార్కెట్లకు వస్తుందని అంచనా. సీసీఐ క్వింటాకు రూ.50 చొప్పున తగ్గిస్తే రైతులు రూ.200 కోట్ల వరకూ ఆదాయం కోల్పోయే అవకాశముంది.

cotton seed length reduced causing huge loss to farmers in telangana
దూది పింజ పొడుగు తగ్గగా.. రైతులకు రూ.200 కోట్లు నష్టం

By

Published : Nov 9, 2020, 7:09 AM IST

అధిక వర్షాలతో పత్తి పంట నాణ్యతే కాకుండా దూది పింజ పొడుగు తగ్గడంతో రైతులు భారీగా నష్టపోనున్నారు. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిరీతిలో తెలంగాణలో పండిన దూది పింజ పొడుగు తగ్గినట్లు తమ పరిశీలనలో తేలిందని భారత పత్తి సంస్థ(సీసీఐ) రాష్ట్ర మార్కెటింగ్‌శాఖకు లేఖ రాసింది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 4 కోట్ల క్వింటాళ్ల పత్తి మార్కెట్లకు వస్తుందని అంచనా. క్వింటాకు రూ.50 చొప్పున తగ్గిస్తామని సీసీఐ చెబుతోంది. ఈ లెక్కన రైతులు కోల్పోయే ఆదాయం రూ.200 కోట్ల వరకూ ఉంటుంది.

ఈ ఏడాది పొడుగు పింజ దూదికి క్వింటాకు రూ.5825, మధ్యరకం పింజ దూదికి రూ.5515 చొప్పున చెల్లించాలని కేంద్రం నిర్ణయించింది. పొడుగు పింజ అంటే 30 మిల్లీమీటర్లకు పైగా ఉండాలని సీసీఐ వాదన. ప్రస్తుతం రాష్ట్రంలో మార్కెట్లకు వస్తున్న దూది 29.1 నుంచి 29.4 మిల్లీమీటర్ల (మి.మీ.) వరకే ఉంటోందని సీసీఐ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖకు తెలిపింది. కాబట్టి దీన్ని కేంద్రం ప్రకటించిన క్వింటా మద్దతు ధర రూ.5825కు రూ.50 తగ్గించి రూ.5775 చొప్పున ‘బీబీ స్పెషల్‌’ రకం పేరుతో కొంటామని సీసీఐ పేర్కొంది.

ఇప్పటికే పత్తిలో తేమ ఉందని ప్రస్తుతం క్వింటాకు రూ.4 వేలలోపే వ్యాపారులు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకూ సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పంటలో తేమ 8 శాతంలోపు ఉంటేనే మద్దతు ధర ఇస్తామని సీసీఐ నిబంధన పెట్టింది. ఉదాహరణకు ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకూ 2.61 లక్షల క్వింటాళ్లను సీసీఐ కొంటే అందులో 68 వేల క్వింటాళ్లు మాత్రమే 8 శాతంలోపు తేమ ఉందని పూర్తి మద్దతు ధర రూ.5825 చొప్పున చెల్లించింది. మిగతాదానికి అంతకన్నా ధర తగ్గించేసింది. తేమ సమస్యలతోనే నష్టపోతుంటే.. తొలిసారి పింజ పొడుగు ఆధారంగా ధర తగ్గిస్తామని సీసీఐ ప్రకటించడంతో రైతుల్లో అందోళన వ్యక్తమవుతోంది.

ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న వంగడాలనే పత్తి రైతులు ఈ సీజన్‌లోనూ వేశారు. పింజ పొడుగు తగ్గిందని ఇప్పుడు ధర ఎలా తగ్గిస్తారు? తెలంగాణలో ఎప్పుడూ 28 నుంచి 32 మి.మీ.లలోపు పింజ పొడవుండే పత్తినే పండిస్తున్నారు. ఇప్పుడే ధర తగ్గించడం సరికాదు. దీనికి పొడుగు పింజ రకం కింద మద్దతు ధర ఇవ్వాలి.

-సుదర్శన్‌, ప్రధాన పత్తి శాస్త్రవేత్త, ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఏమిటీ పింజ పొడుగు

పత్తి కాయల నుంచి దూదిని కూలీలతో తీయించి మార్కెట్లకు రైతులు తెస్తారు. ఈ దూదిని యంత్రంతో ఎంత పొడవు ఉందో నిపుణులు కొలుస్తారు. పింజ 32 మి.మీ.లకన్నా ఎక్కువుంటే పలుచని, సన్నని పాలిస్టర్‌ వంటి రకాల నాణ్యమైన వస్త్రాలు తయారవుతాయి. ప్రపంచంలో పింజ పొడుగు 35 మి.మీ.లకన్నా ఎక్కువ దూదిని ఈజిప్ట్‌, అమెరికా, చైనాల్లో పండిస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీలు పొడుగు పింజ దూదిని కొని వస్త్రాల తయారీకి వినియోగిస్తాయి.

ఇదీ చదవండిఃప్రకృతి వ్యవసాయంతో సిరులు పండిస్తున్న రైతు సుజాత

ABOUT THE AUTHOR

...view details