Cotton Cultivation in Telangana : రాష్ట్రంలో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. ఈ వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో కోటీ 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. అందులో 70 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగయ్యేలా చూడాలని ఆ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న కారణంగా ఈ పంటనే సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆ శాఖ యోచిస్తోంది.
తెలంగాణలోని ఎర్రచెలక, దుబ్బనేలల్లో పత్తి దిగుబడి తక్కువగా ఉంటోందని, దీన్ని పెంచడంపై దృష్టి సారించాలని కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్రానికి తాజాగా సూచించింది. రాష్ట్రంలో గత మూడేళ్ల(2019-22)లో సాగైన పత్తి విస్తీర్ణం, దిగుబడి, హెక్టారుకు సాధించిన సగటు దిగుబడి ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నట్లు కేంద్రం పేర్కొంది.
దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో హెక్టారుకు సగటున 585 కిలోల(5.85 క్వింటాళ్ల) దూది పంట పండగా.. తెలంగాణలో 500 కిలోలు మాత్రమే వచ్చిందని వెల్లడించింది. తెలంగాణలో ఆదిలాబాద్ వంటి కొన్ని ప్రాంతాల్లో అనుకూల వాతావరణం, అనువైన భూములు ఉండటంతో కొందరు రైతులు హెక్టారుకు 25 నుంచి 30 క్వింటాళ్ల పత్తి పండిస్తున్నారు.
ఎర్రచెలక నేలలు ఉన్న నల్గొండ, మహబూబ్‌నగర్, నారాయణపేట వంటి ప్రాంతాల్లో హెక్టారుకు 5 క్వింటాళ్లకు మించి ఉత్పాదకత రావడం లేదు. దీనివల్ల రాష్ట్రంలో సగటు ఉత్పాదకత చాలా తక్కువగా.. అంటే హెక్టారుకు 5 క్వింటాళ్లే నమోదైంది. గతేడాది రాష్ట్రంలో 47 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగయితే వ్యవసాయ మార్కెట్లకు 45 లక్షల క్వింటాళ్లకు మించి రాలేదు. గత సంవత్సరం అధిక వర్షాలు, తెగుళ్లు పంటను బాగా దెబ్బతీశాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అకాల వర్షాలు, తుపాన్లు, రసం పీల్చు పురుగు తదితర కారణాల వల్ల ఉత్పాదకత తగ్గుతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వివరించింది.
కొత్త పద్ధతులతో అధిక దిగుబడి... 'తెలంగాణలో పత్తి సాగుకు అనువైన భూములు, అనుకూల వాతావరణం ఉంది. ఎర్రచెలక, దుబ్బనేలల్లో వర్షాలపై ఆధారపడి ఈ పంటను సాగుచేస్తే తక్కువ దిగుబడి వస్తున్నట్లు గుర్తించాం. ఇలాంటి నేలల్లో అధిక సాంద్రత విధానంలో సాగుచేస్తే దిగుబడి పెరుగుతుంది. సాధారణ పద్ధతిలో ఎకరానికి 7,500 పత్తి మొక్కలు వేస్తే.. అధిక సాంద్రత విధానంలో 25వేల మొక్కల దాకా వేయాలి. దీనివల్ల ఎక్కువ పత్తి చెట్ల నుంచి ఎక్కువ దూది వచ్చి సగటు దిగుబడి పెరుగుతుంది. సాగు పద్ధతులు మార్చి ఆధునిక పరిజ్ఞానంతో యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి పెరిగే అవకాశముంటుంది.' -- డాక్టర్ జగదీశ్వర్, పరిశోధనా సంచాలకుడు, ఆచార్య జయశంకర్ వర్సిటీ