తెలంగాణ

telangana

ETV Bharat / city

వసతి గృహాల్లో 14 ఏళ్లుగా పెరగని కాస్మొటిక్‌ ఛార్జీలు

No hike in Cosmetic charges for students సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు దూరమవుతున్నారు. గత 14 ఏళ్లుగా కాస్మొటిక్‌ ఛార్జీలను పెంచకపోవడం, ప్రతినెలా వాటిని సకాలంలో ఇవ్వకపోవడమే దీనికి కారణంగా ఉంటోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.

No hike in Cosmetic charges for students
No hike in Cosmetic charges for students

By

Published : Aug 30, 2022, 9:28 AM IST

No hike in Cosmetic charges for students : సంక్షేమ వసతి గృహాల్లోప్రతినెలా ఇవ్వాల్సిన కాస్మొటిక్‌ ఛార్జీలను మూడు నెలలకోసారి చెల్లించడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు 14 ఏళ్లుగా కాస్మొటిక్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల విద్యార్థులు పరిశుభ్రతకు దూరమవుతున్నారు. ఆగస్టు చివరి వారంలో నగదు అందుతుందని వార్డెన్సు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు టీచర్లు, వార్డెన్ల నుంచి చేబదులు తీసుకుని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో మాత్రం నెలకు అవసరమైన ఛార్జీలు చెల్లించారు. గిరిజన, బీసీ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో బిల్లులు సిద్ధమైనా నగదు పంపిణీ మొదలు కాలేదు.

రెండుసార్లు ప్రతిపాదనలు పంపినా..కాస్మొటిక్‌ ఛార్జీలను చివరగా ఉమ్మడి రాష్ట్రంలో 2008 మార్చిలో పెంచారు. 3-7 తరగతి బాలురకు నెలకు రూ.50, బాలికలకు రూ.55 చొప్పున, 8-10 తరగతి పిల్లలకు రూ.75 చొప్పున ఖరారు చేశారు. గత 14 ఏళ్లలో నిత్యావసర వస్తువులు, కాస్మొటిక్‌ సాధనాల ధరలు రెట్టింపు అయ్యాయి. సబ్బులు, కొబ్బరినూనె ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఆడపిల్లలకు కీలకమైన పౌడర్‌, శానిటరీ నాప్కిన్స్‌పై ధరలు ఆర్థిక భారంగా మారాయి. కాస్మొటిక్‌ ధరలు పెరిగినా పిల్లలకిచ్చే నిధులు పెంచలేదు. వసతి గృహాల్లో బాలుర హెయిర్‌కట్‌కు రూ.12, గురుకులాల్లో రూ.20 చొప్పున ఇస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పెరిగిన ధరలకు అనుగుణంగా గురుకులాలు, వసతి గృహాల్లో 5-7 తరగతి బాలికలకు నెలకు రూ.125, 8-10 తరగతి బాలికలకు రూ.200 ఇవ్వాలని, 5-7 తరగతి బాలురకు నెలకు రూ.100, 8-10 తరగతి బాలురకు నెలకు రూ.150 ఇవ్వాలని రెండుసార్లు ఎస్సీ సంక్షేమశాఖ ప్రతిపాదనలు పంపించినా ఆమోదం లభించలేదు.

అమలుకు నోచుకోని ఉచిత శానిటరీ నాప్కిన్స్‌..సంక్షేమ వసతి గృహాల్లో బాలికలకు నెలకు రూ.75, గురుకులాల్లో రూ.140 చొప్పున ఇస్తున్నారు. ఈ నగదు నెలసరి సమయంలో శానిటరీ నాప్కిన్స్‌కు సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు నెలసరి సమయంలో తరగతులకు డుమ్మాకొట్టాల్సి వస్తోంది. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో ఉచితంగా శానిటరీ నాప్కిన్స్‌ పంపిణీ చేస్తామని, విద్యార్థులకు కాస్మొటిక్‌ కిట్స్‌ ఇస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణలోకి రాలేదు. శానిటరీ నాప్కిన్స్‌, స్నానం సబ్బులు, షాంపూ, బట్టల సబ్బులు, కొబ్బరి నూనె, టూత్‌పేస్టు, దువ్వెన, బొట్టు, రిబ్బన్‌, పౌడర్‌, హెయిర్‌ పిన్స్‌ కోసం బాలికలకు నెలకు రూ.350 వరకు ఖర్చు ఉంటుందని, బాలురకు రూ.200కు పైగా అవసరమని సంక్షేమవర్గాల అంచనా.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details