తెలంగాణ

telangana

ETV Bharat / city

మోయలేనంత రుసుం, చెల్లించకపోతే జులుం ఒత్తిడికి గురవుతున్న తల్లిదండ్రులు - రామంతపూర్ ఘటన తాజా సమాచారం

Corporate Colleges Fees Pressure on Parents మనం పడే కష్టాలు మన పిల్లలు పడొద్దు.. ఒళ్లు హూనం చేసుకొనైనా కష్టపడి పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివిద్దాం.. ఫీజులు మోయలేనంత భారమైనా అప్పోసప్పో చేసి చెల్లిద్దామని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు ఎప్పుడైనా పరిస్థితులు తారుమారైన సమయంలో కొద్దోగొప్పో కట్టకపోతే సర్టిఫికెట్లు నిలిపేయడం చేస్తున్నాయి తాజాగా రామంతాపూర్‌ నారాయణ కళాశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

Corporate colleges
Corporate colleges

By

Published : Aug 20, 2022, 9:56 AM IST

Corporate Colleges Fees Pressure on Parents: ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులు మోయలేనంత భారమైనా అప్పోసప్పో చేసి.. మనం పడే కష్టాలు మన పిల్లలు పడొద్దు.. ఒళ్లు హూనం చేసుకొనైనా.. కష్టపడి పిల్లలను చదివిద్దామని తల్లిదండ్రులు భావిస్తున్నారు. లక్షలాది రూపాయల ఫీజులు దాదాపుగా చెల్లిస్తున్నారు. ఎప్పుడో పరిస్థితులు తారుమారైన సమయంలో కొద్దోగొప్పో కట్టకపోతే సర్టిఫికెట్లు నిలిపేయడం చేస్తున్నాయి రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు. పెద్దసంఖ్యలో విద్యాశాఖకు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ.. కనీస స్పందన కొరవడుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ సహా వివిధ కోర్సుల కళాశాలల ఫీజుల విషయంలో దోపిడీకి గురవుతున్నారు. తాజాగా రామంతాపూర్‌ నారాయణ కళాశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పలువురు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తల్లకిందులైంది. ఫీజులు చెల్లించలేని పరిస్థితికి చేరారు. అటు తల్లిదండ్రులు దయనీయ స్థితి.. ఇటు కళాశాలల యాజమాన్యాల దోపిడీ మధ్య విద్యార్థులు బలవుతున్నారు. కొన్ని కార్పొరేట్‌, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు రెండేళ్లకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంటర్‌తోపాటు ఎంసెట్‌, ఐఐటీ-జేఈఈలకు తర్ఫీదు ఇస్తూ అదనపు ఫీజులు దండుకుంటున్నాయి. ఫీజులపై నియంత్రణ లేక తల్లిదండ్రులు అప్పులు తెచ్చి మరీ కడుతున్నారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ కళాశాలల్లోనూ ఫీజుల దోపిడీ అధికంగా ఉంది. డొనేషన్ల పేరిట రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం బీటెక్‌ మేనేజ్‌మెంట్‌ సీటును రూ.5-10 లక్షల మధ్య అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. విద్యార్థుల చదువు పూర్తయ్యాక బదిలీ సర్టిఫికెట్‌(టీసీ), ఒరిజినల్‌ మార్కుల మెమో, డిగ్రీ పట్టాలు, ప్రొవిజినల్స్‌ వంటివి తీసుకునేందుకు కళాశాలలనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పరీక్షలు రాసేందుకు వీల్లేకుండా హాల్‌టికెట్లు నిలిపేస్తున్నారు. ఇలా ఏవో ఒక పత్రాలను అడ్డం పెట్టుకుని సతాయిస్తున్నారు.

ఫీజులపై నియంత్రణేదీ..కళాశాలల స్థాయిలో ఫీజులపై నియంత్రణ కొరవడుతోంది. వాస్తవానికి పాఠశాలల స్థాయిలో మరుసటి ఏడాదికి పది శాతానికి మించి ఫీజులు పెంచకూడదని కేబినెట్‌ సబ్‌కమిటీ గత మార్చిలో భేటీ అయి పలు సూచనలు చేసింది. ఇవి నేటికీ అమల్లోకి తీసుకురాలేదు. కళాశాల స్థాయిలో ఫీజులపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఇంటర్‌, డిగ్రీ స్థాయిలో ప్రైవేటు కళాశాలల్లో ఇష్టారాజ్యంగా నిర్ణయించి వసూలు చేస్తున్నారు.

రీయింబర్స్‌మెంట్‌ రాక..కళాశాలలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు బకాయిలు సకాలంలో విడుదల కావడం లేదు. పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నమ్ముకుని విద్యనభ్యసిస్తున్నారు. ఫీజులు సకాలంలో విడుదల కావడం లేదు. రాష్ట్రంలో రూ.3,900 కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నాయి. ఈ ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. రూ.లక్షలు చెల్లించలేక ఉన్నత విద్యకు వెళ్లే దారి లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఖండించిన విద్యార్థి సంఘాలు..

రామంతాపూర్‌ నారాయణ కళాశాలలో ఫీజు బకాయి విషయంలో శుక్రవారం జరిగిన ఘటనను పలు విద్యార్థి సంఘాలు ఖండించాయి. కార్పొరేట్‌ కళాశాలల్లో ఫీజులు నియంత్రించే వరకు ఉద్యమిస్తామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు పి.శ్రీహరి వేర్వేరు ప్రకటనలో విమర్శించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.పరశురాం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎల్‌.మూర్తి తెలిపారు. అంబర్‌పేటలో ధర్నా చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్‌ ఖండించారు. ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు దీపక్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details