హలో వెయిటర్.. మెనూ ఎక్కడ..? ఏమేం ఉన్నాయ్..? ఏది బాగుంటుంది..? ఇలా అడిగే రోజులు కావివి.. ఏమున్నాయో సూచిక బోర్డు మీద చూసి, నచ్చింది తినేసి వచ్చేయడమే.. వెయిటర్‌కి టిప్పు ఇద్దామని రూ.ఇరవై ఇచ్చినా.. గూగుల్‌పే చేయండి అనే రోజులివి. ఇదే కాదు.. హోటల్ తలుపు వద్దే నమస్కారం చేసి సాదరంగా ఆహ్వానించే సెక్యూరిటీ గార్డు ఇప్పుడు థర్మల్ స్క్రీనింగ్ చేసి.. చేతిలో శానిటైజర్ చల్లాకే లోపలికి పంపుతున్నాడు. ఆర్డర్ చేయగానే బల్లలపై ప్రత్యక్షమయ్యే ఫైబర్, రాగి కంచాలూ కనిపించవు.. వాడి పడేసే కంచాల్లో తినాల్సిందే. కరోనా నేపథ్యంలో పలు హోటళ్లలో ఇదే తంతు కనిపిస్తోంది. దీన్నే ఎవర్నీ తాకకుండా తినడం(కాంటాక్ట్ లెస్ డైనింగ్) పద్ధతి అంటున్నారు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండడంతో తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. టేక్‌అవేలోనూ ఇదే విధానం అవలంబిస్తున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలు ఇలాగే డెలివరీలు ఇస్తున్నాయి.
- అన్ని హోటళ్లూ అదే బాట
దాదాపు రెండు నెలల లాక్‌డౌన్ తర్వాత హోటళ్లకు అనుమతి రావడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. తక్కువ సిబ్బందితోనే కార్యకలాపాలు మొదలయ్యాయి. ఒక్కో హోటల్లో గతంలో పది నుంచి 20 మంది దాకా వెయిటర్లు, సహాయకులు పనిచేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య ఐదుగురి వరకే కన్పిస్తోంది. పాత కంచాలు, గ్లాసులన్నీ తీసి వాటి స్థానంలో వాడిపడేసే పళ్లాలు, గ్లాసులు వాడుతున్నారు. పలువురు తాకే అవకాశం ఉండడంతో మెనూ కార్డులనూ తీసేశారు. బదులుగా రాత, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులపై ఆరోజు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల పేర్లు రాస్తున్నారు. వాటిని చూసి ఆర్డర్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. భౌతిక దూరం తప్పనిసరి చేశారు.
- టేక్‌అవేకే మొగ్గు