కొద్దిరోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఓ నగర యువకుడు.. తన ముగ్గురు మిత్రులతో ఒకే సిగరెట్ పంచుకున్నాడు. మూడు రోజుల తర్వాత లక్షణాలతో పరీక్ష చేయించుకోగా నలుగురికీ వైరస్ సోకినట్లు తేలింది. ఇది సిగరెట్ ద్వారానే జరిగిందని వైద్యుల మాట. ఇది సిగరెట్ వల్ల ప్రత్యక్షంగా కలిగే ముప్పయితే.. పరోక్షంగానూ దీంతో తీవ్ర సమస్యలున్నాయి. కరోనా విజృంభిస్తోన్న వేళ సాధారణ జనంతో పోల్చితే పొగరాయుళ్లపై 14% అధికంగా ప్రభావం చూపిస్తున్నట్లు గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చాలామంది ధూమపానానికి దూరమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కొందరు మానేశామని సంప్రదిస్తుంటే ఇంకొందరు మావల్ల కావట్లేదంటూ వస్తున్నారంటున్నారు.
ఏటా పెరిగి.. ఇప్పుడు తగ్గి..
గ్రేటర్ పరిధిలో ఏటా పొగరాయుళ్ల సంఖ్య పెరుగుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఏటా 18.1% మంది పాఠశాల విద్యార్థులు పొగాకుకు బానిసలవుతున్నారని వెల్లడిస్తున్నాయి. సిగరెట్లకు అలవాటు పడిన వారిలో 50% హుక్కాకు బానిసలు. అయితే ఇప్పుడు హుక్కా కేంద్రాలు, కాలేజీలు లేకపోవడంతో అలవాట్లు నేర్పే సమూహాలకు దూరంగా ఉండటం వల్ల క్రమంగా స్మోకర్లు తగ్గుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు వైరస్ భయంతోనూ, ఇంట్లోవాళ్ల ఒత్తిడితోనూ ఎక్కువ మంది మానుతున్నారు.
ప్రభావం ఏమేరకు ఉందంటే..
- కరోనా బారిన పడిన జనానికి 6 నుంచి 8 లీటర్ల ఆక్సిజన్ అవసరం పడుతోంటే పొగ తాగేవారికి 10 నుంచి 12 లీటర్ల ఆక్సిజన్ అవసరం పడుతోంది.
- సాధారణ బాధితులు 15 రోజుల్లో పూర్తిగా కోలుకుంటుంటే పొగరాయుల్లు కనీసం 20 రోజులకుపైగా వైరస్‌తో బాధపడుతున్నారు.
- ఇతర బాధితుల్లో ఊపిరితిత్తులు సమర్థంగా పనిచేస్తుంటే పొగరాయుళ్లలో అవి క్షీణించి వెంటిలేటర్‌దాకా వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
- వైరస్ బారిన పడుతున్న వారిలోనూ పొగ అలవాటు ఉండి అప్పటికే ఊపిరితిత్తులు క్షీణించిన వారే ఎక్కువ మంది చనిపోతున్నారు.
దూరమయ్యే దారేదీ?
- సంకల్పం: ఎలాగైనా, ఎంత కష్టమైనా మానేయగలననే బలమైన సంకల్పం తీసుకోవాలి.
- భరించాలి:దూరమవ్వడం మొదలయ్యాక తాత్కాలికంగా మానసిక, శారీరక బాధల్ని తట్టుకొనే శక్తి తెచ్చుకోవాలి.
- భయముండాలి:పొగాకుకు మళ్లీ దగ్గరైతే వైరస్ సోకుతుందనే భయాన్ని మనసులోంచి తీసేయొద్దు.
- సంప్రదించాలి:ఎవరైతే పూర్తిగా వదిలేయడం కష్టం అనుకుంటారో వారు అప్పటికే ఈ వ్యసనానికి దూరమైన వారిని తరచూ సంప్రదిస్తూ ఉండాలి. మానసిక నిపుణుల్నీ కలవాలి. సమూహాలకు దూరమవ్వాలి.
- ఒక్కో మెట్టు: ఒకేసారి ఆపేయొద్దు. మొత్తం మూడువారాల సమయం తీసుకోవాలి. ఒక్కో వారం 30% శాతం తగ్గిస్తూ రావాలి. 9 సిగరెట్లు అలవాటుంటే దాన్ని 6, 3కు తగ్గించి మొత్తానికే మానేయాలి.
- ప్రకటించుకోవాలి:నేను సిగరెట్లు మానేస్తున్నానని కుటుంబసభ్యులు, స్నేహితుల ముందు ప్రకటించుకోవాలి. అప్పుడే తప్పనిసరిగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.
- అలవాట్లు మార్చుకో:వ్యసనం నుంచి మనసు మళ్లేలా శ్వాస, శారీరక వ్యాయామాలు చేయాలి. ఆవిష్కరణలు, రచనలు, ఆలోచనత్మాక పనులకు దగ్గరవ్వాలి. అయినోళ్లతో సమయం గడపాలి.
మహమ్మారి భయపెడుతోంది
గతంలో 30 మంది కన్సల్టేషన్‌కి వస్తే అందులో 8 మంది మద్యం, ఇద్దరు సిగరెట్లు మానాలని వచ్చేవారు. ఏడాది కాలంగా 30లో 10మంది సిగరెట్లు మానేందుకు వస్తున్నారు. వీరిలోనూ మొదటి దశలో మానేసి మళ్లీ మొదలుపెట్టి.. రెండోదశ తీవ్రం కాగానే మళ్లీ మానేసేందుకు ఆలోచన చేస్తున్నవారు ఎక్కువుంటున్నారు. కరోనాతో చాలామందిలో భయం పుట్టించింది.