నిజంగా కరోనా అంటే అంత భయపడాలా? ఆ వ్యాధి సోకిందని తెలిస్తే అంతా అయిపోయిందని ఆందోళన చెందాలా? అవసరం లేదనే చెబుతున్నారు.. కొందరు విజేతలు! అలాగని జాగ్రత్తలు పాటించకపోయినా, ఆసుపత్రికి వెళ్లడంలో జాప్యం చేసినా ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం లేకపోలేదు. కరోనాకు చికిత్స చేయించుకుని, ఆస్పత్రుల నుంచి ఆరోగ్యంగా తిరిగి వచ్చి, సాధారణ జీవితం గడుపుతున్న కొందరి అనుభవాలివి. వారందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట ఒక్కటే.. మనోధైర్యానికి మించిన మందు లేదు. వైద్యుల పర్యవేక్షణలో మందులు, మంచి ఆహారం తీసుకుంటే తేలిగ్గా బయటపడొచ్చు.
యోగా, ప్రాణాయామంతో సాంత్వన
'నా వృత్తి పౌరోహిత్యం. మే నెలలో నా భార్యకు గొంతునొప్పి, జలుబు అనిపిస్తే.. అనుమానంతో కరోనా పరీక్షలు చేయించాం. నాకు, నా భార్యకు, ఒక కుమారుడికి పాజిటివ్ అని తేలింది. మరో కుమారుడికి నెగెటివ్ వచ్చింది. నా వయసు 65 ఏళ్లయినా, ఇతర అనారోగ్యాలు లేకపోవటంతో భయపడలేదు. రోజూ యోగా, ప్రాణాయామం చేస్తుంటాను. ఊపిరితిత్తులు బలపడేందుకు అది చాలా తోడ్పడింది. 14 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్నాం. అక్కడ మందులతో పాటు.. రాగి జావ, సోయా గింజలు ఇచ్చారు. ఇంటికి వచ్చిన నాలుగైదు రోజులకు నాకు మళ్లీ జ్వరం వచ్చింది. అనుమానంతో పరీక్షలు చేస్తే.. ఈసారి నెగెటివ్ అనే వచ్చింది. కరోనా సోకినా ఎవరూ భయపడొద్దు. సమయానికి ఆహారం తీసుకోండి. దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, లవంగాల కషాయం తీసుకుంటే మంచిది. మేమంతా అదే పాటించాం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం.’-- హిందూపురానికి చెందిన కరోనా విజేత
వ్యాధి లక్షణాలు కనిపించలేదు
'మేం ఒక పెళ్లికి వెళ్లి వచ్చాక నా భార్యకు దగ్గు, ఆయాసం వచ్చాయి. దాంతో పరీక్షలు చేయించుకున్నాం. ఆమెతో పాటు నాకు, మా వదినకూ పాజిటివ్ అని వచ్చింది. మా వదినకు 58 ఏళ్లు, ఆమెకు మధుమేహం ఉంది. మా భార్యకు తప్ప మా ఇద్దరికీ లక్షణాల్లేవు. 13 రోజులు ఆసుపత్రిలోనే ఉండి, చికిత్స తీసుకున్నాం. తర్వాత నెగెటివ్ రావడంతో డిశ్ఛార్జి చేశారు. ఆసుపత్రిలో వారు ఇచ్చిన మందులు, ఆహారమే తీసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదు. ముగ్గురం ఆరోగ్యంగా ఉన్నాం’ -- తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన 58 ఏళ్ల వ్యాపారి
వయసు పెద్దదైనా సమస్యలేమీ రాలేదు
'చేపల వేటకు వెళ్తుంటా. నాకు మధుమేహం, బీపీ ఉన్నాయి. స్థానిక ఆర్‌ఎంపీ వద్ద మధుమేహ పరీక్ష చేయించుకున్నాను. ఆయన చికిత్స చేసినవారిలో ఎవరికో కరోనా వచ్చిందని తెలిసి.. ఆయన దగ్గరకు వెళ్లిన వారందరికీ పరీక్షలు చేశారు. నాకు, నా భార్యకు పాజిటివ్ అని తెలిసింది. కరోనా గురించి టీవీల్లో చూడటం, వార్తల్లో వినడం తప్ప.. మాకూ వస్తుందని అనుకోలేదు. కొంచెం భయం అనిపించింది. నా వయసు ఎక్కువ కావటంతో విశాఖలోని కొవిడ్ ఆసుపత్రికి పంపించారు. నా భార్యకు అమలాపురంలో చికిత్స చేశారు. ఆసుపత్రిలో అన్నం, చపాతీ, పళ్ల రసాలు, గుడ్డు ఇచ్చేవారు. రోజుకు 2 మాత్రలు ఇచ్చారు. నాకు జ్వరం, గొంతునొప్పి, ఆయాసం లాంటివేవీ రాలేదు. మేమిద్దరం ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చి 32 రోజులైంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాం.' -- తూర్పుగోదావరి జిల్లా జి.మామిడాడకు చెందిన 61 ఏళ్ల వ్యక్తి