రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న 56 కేసులు నమోదవ్వగా.. ఆ తర్వాత 22న 15, 23న 27, 24న 13 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ప్రభుత్వ కార్యాచరణ గట్టిగా అమలవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎక్కువ జనసాంద్రత కలిగిన నగరాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతంగా హైదరాబాద్‌ను ఎంపిక చేసి, ఇక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఆ ప్రాతిపదికన సూర్యాపేట, జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాలూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణపై కేంద్ర బృందం పర్యటనలో సమీక్షించనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
ఆ నాలుగు ప్రాంతాల్లో...
నాలుగు జిల్లాలు.. తొమ్మిది రోజులు.. 189 కేసులు.. జీహెచ్‌ఎంసీ, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో కరోనా కేసుల వ్యాప్తి తీరిది. గత తొమ్మిది రోజుల్లో ఈ నాలుగు ప్రాంతాల్లో కేసులు గణనీయంగా పెరిగాయి. వికారాబాద్ జిల్లాలో ఈ నెల 9 నుంచి 23 వరకూ (15 రోజుల్లో) కేసులు 5 నుంచి ఏకంగా 38 (ఏడింతలు)కి పెరిగాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇప్పటికే మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త కేసులు లేని 45 ప్రాంతాలను ప్రభుత్వం శుక్రవారం కంటెయిన్‌మెంట్ జోన్ల జాబితా నుంచి తొలగించింది.
- కేవలం రెండు పాజిటివ్ కేసులు నమోదైన పెద్దపల్లి జిల్లాకు ఊరట కలిగింది. వైరస్ సోకిన ఇద్దరు బాధితులు కోలుకుని డిశ్ఛార్జి కావడం, కొత్త కేసులు లేకపోవడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ రామగుండంలో రెడ్‌జోన్‌ను ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.