తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రతి వంద మందిలో.. 20 మందికి కరోనా వైరస్..!‌ - Corona virus spread in AP

కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. మలిదశలో తక్కువ వ్యవధిలోనే విజృంభిస్తున్నాయి. ఏపీలో శనివారం 35,907 నమూనాలు పరీక్షించగా 7,224 కేసులు బయటపడ్డాయి. అంటే.. ప్రతి వంద మందిలో 20 మందికి వైరస్‌ సోకింది. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోనే 67% కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1,051, తూర్పుగోదావరి జిల్లాలో 906, గుంటూరు జిల్లాలో 903 చొప్పున కేసులొచ్చాయి. పశ్చిమ గోదావరిలో తక్కువగా 96 కేసులు రికార్డయ్యాయి. ఈ నెల 17 రోజుల్లో కలిపి చిత్తూరు జిల్లాలో 9,282 కేసులు వచ్చాయి. ఆ తర్వాత అధికంగా 7,994 కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి.

ap news, ap covid news
ఏపీ కరోనా వార్తలు, ఏపీ కొవిడ్ వార్తలు

By

Published : Apr 18, 2021, 9:01 AM IST

ఏపీలో కరోనా కేసులు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రికార్డుస్థాయిలో 20.11% పాజిటివిటీ నమోదైంది. అంటే పరీక్షించిన ప్రతి ఐదుగురిలో ఒకరు వైరస్‌ బారిన పడినట్లయింది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు పరీక్షించడం, గుర్తించడం, చికిత్స అందించడం (టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌) విధానం అవలంభించాలని కేంద్రం పదేపదే సూచిస్తోంది. పరీక్షలు పెంచితేనే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంతో పాటు ఏం చేయాలో తెలుస్తుందని ఈ నెల 8న సీఎంలను ఉద్దేశించి ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఏపీలో మాత్రం పరీక్షలు పెరగడంలేదు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, ల్యాబ్‌ల ద్వారా రోజూ 90 వేలకుపైగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసే అవకాశం ఉన్నా... రోజుకు సగటున 35వేలు మాత్రమే జరుగుతున్నాయి. చికిత్సలో కీలకంగా ఉన్న రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లకూ కొరత ఏర్పడుతోంది. ఆక్సిజన్‌ అవసరాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో శనివారం నిర్వహించిన 35వేల పరీక్షలకు 7,224 కేసులు బయటపడ్డాయి. అదే.. లక్ష వరకు పరీక్షలు చేస్తే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని వైద్యనిపుణులు అంటున్నారు. వైరస్‌ సోకిన వారిని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి... చికిత్స చేస్తే వ్యాప్తిని నియంత్రించేందుకు వీలుంటుంది. ఒక్కసారిగా కేసులు పెరిగితే పడకలు దొరక్కపోవడంతో పాటు కొత్త సమస్యలూ తలెత్తే అవకాశం ఉంది.

కిందటేడాది వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో జులై 29న నిర్వహించిన 70,584 పరీక్షలకు 10,093 (14.30%), 30న చేసిన 70,068 పరీక్షలకు 10,167 (14.51%) మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఆగస్టు నెలాఖరులో 56-60వేల పరీక్షలు చేయగా 10వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. తొలి దశలో అత్యధికంగా అక్టోబరు నెలాఖరులో 88,778 పరీక్షలు జరిపారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాప్తి చెందకుండా చాలావరకు కట్టడిచేశారు. ఇప్పుడు వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున తక్కువ పరీక్షలకే అధిక సంఖ్యలో కేసులు వస్తున్నాయి. కానీ.. వారి సన్నిహితుల గుర్తింపు చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. వీరిని నలుగురితో కలవకుండా చూడడంలో జిల్లా అధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details